వైసీపీ నేతలే రాజధాని రోడ్ల దొంగలు!
posted on Aug 11, 2021 @ 8:47PM
అభివృద్ధి అంటే నచ్చదు.. విధ్వంసం అంటే హుషారు... ఇదీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతల గురించి జనాల్లో జరుగుతున్న చర్చ. గత రెండేండ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగపోగా విధ్వంసాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి ప్రజా వేదిక కూల్చివేత మొదలు ఎన్నో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆలయాల్లో దేవతా విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరికి ఏపీ కలల రాజధాని అమరావతి రోడ్లను కూడా వదకలపోవడం విధ్వంసకాండకు పరాకాష్టగా నిలిచింది.
గత కొన్ని రోజులుగా అమరావతిలోని రోడ్లు విధ్వంసానికి గురవుతున్నాయి. రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి. జేసీబీలతో రహదారులను తవ్వేస్తూ ఇసుక, కంకర తరలిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు. దీంతో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి ప్రాంతం శిథిలమైన భవనంలా మారింది.
ఇదే దొంగలకు వరంగా మారింది ఇసుక, కంకర, స్టీల్ ఎత్తుకుపోవడం మొదలెట్టారు. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే.. పట్టించుకునేవాడే కరువయ్యాడు. అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూ పట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. మొదట పోలీసులు కూడా పట్టించుకోలేదు. అయితే రోడ్లను తవ్వేస్తున్న దృశ్యాలను కొందరు సెల్ పోన్లలో చిత్రీకరించారు. అవి వైరల్ గా మారాయి. దీంతో విచారణ జరపాల్సిన తప్పనిసరి పరిస్థితి పోలీసులకు ఎదురైంది.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాజధాని రైతులు, విపక్షాలు అనుమానించినట్టే వైసీపీ నేతలే ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అమరావతి రాజధాని సాధన కోసం ఓవైపు రైతులు, ప్రజలు ఆందోళనలు చేపడుతుంటే.. వైసీపీ నాయకులు ప్రధాన రహదారులను తవ్వి, ఆ మెటీరియల్‌ను గ్రామాల రోడ్లకు వినియోగిస్తున్నారు. విచారణలో తేలడంతో వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రాజధాని రోడ్డు ఎన్-14ను తవ్వి.. ఆ మెటీరియల్‌ను శాఖమూరు గ్రామంలో రోడ్డుకు వినయోగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వైసీపీ నాయకుడు తాడికొండ మార్కెట్ యార్డు డైరెక్టర్ జొన్నకూటి ప్రశాంత్ కీలక పాత్ర వహించారని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. రోడ్డు మెటీరియల్ పోయిందని బీఎస్‌సీపీఎల్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు.
శాఖమూరు ప్రధాన రహదారి మరమ్మతుల కోసం పంచాయతీ నిధులు రూ.2.50లక్షలు కేటాయించారు. ఆ పనులను అధికార పార్టీకి చెందిన ప్రశాంత్, వైసీపీ మండల ఉపాధ్యక్షుడు కొయ్యకూర వినోద్ చేస్తున్నారు. మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీతో రోడ్డు తవ్వారని సీఐ తెలిపారు. వైసీపీ మండల ఉపాధ్యక్షుడు కొయ్యగూర వినోద్, ప్రశాంత్‌పై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.రాజధానిని నాశనం చేయాలనే దృఢ సకల్పంతో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లను వైసీపీ నాయకులు తవ్వి.. వేరే చోట రోడ్డు వేసుకొని బిల్లులు చేసుకొని, జేబులు నింపుకుంటున్నారని మార్టిన్ ఆరోపించారు. వైసీపీ నేతల ఆగడాలకు ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు.