ఆగస్టులోనే మంత్రివర్గ విస్తరణ? సంచలనం చేయబోతున్న కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ/ విస్తరణ కసరత్తు ప్రారంభించారా? త్వరలోనే ఆ ఒక్కటీ కూడా కానిచ్చి, దళిత అజెండాను సంపూర్ణం చేస్తారా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి చేయక పోగా, ఉప ముఖ్యమంత్రి పదవినీ ఊడపీకారని విపక్షాలు చేస్తున్న విమర్శకు జవాబుగా.. మళ్ళీ మరోమారు మరో దళితనేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఒకప్పుడు ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలు అసలు పట్టించుకునే వారు కాదు. విపక్ష పార్టీలకు పనీపాట లేదని, అవగాహనా అసలే లేదని అందుకే పని కట్టుకుని విమర్శలు చేస్తుంటారని ముఖ్యమంత్రి పలు సంధర్భాలలో పేర్కొన్నారు. ఒక విధంగా ఆయన విపక్షాల విమర్శలను తేలిగ్గా తీసేపారేయడం అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాదు, జాతీయ పార్టీల జాతీయ నాయకుల నుంచి కీలక పదవులలో ఉన్న ప్రాతీయ పార్టీల నాయకుల వరకు ఎవరికీ కూడా ఏమీ తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశ్చితాభిప్రాయం. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఏది మంచో ఏది చెడో తనకు తప్ప మరొకరికి తెలుసంటే అసలే ఒప్పుకోరు. ఆన్ని విషయాలను, శాస్త్రీయంగా అధ్యనం చేసి సమస్యలను, పరిష్కారాలను ప్యాక్ చేసి పెట్టుకున్నానని, తనకు మాత్రమే ఆ వివరాలు తెలుసుని, ఆయన నమ్ముతారు ఇతరులు నమ్మితీరాలంటారు. అదే విషయాన్ని అయన అనేక సందర్భాలలో బహిరంగంగానే బయట పెట్టారు. నిజానికి ఇప్పటికి కూడా అయన అదే అభిప్రాయంతో ఉన్నారు.
అయితే అనవసరంగా, అనాలోచితంగా తలకు చుట్టుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కంప నుంచి బయట పడేందుకు కావచ్చు, ఇటీవల కాలంలో ఆయన తమ ఆలోచనా పంథాను కొద్దిగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. విపక్షాలను ఉపేక్షిస్తే, అసలుకే మోసం జరిగే ప్రమాదం పొంచి ఉందని గ్రహించారో ఏమో కానీ, విపక్షాల విమర్శలకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రారన్న విపక్షాల విమర్శకు జవాబుగా బయటకు వచ్చారు, ఎదో ఒక వంకన ఉరూరా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే మరిచి పోతారు, మళ్ళీ మళ్ళీ అవే హామీలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారని, ఎన్నికల తర్వాత అసలు ఆవైపు కన్నెత్తి అయినా చూడనే విమర్శకు జవాబుగా, నాగార్జున సాగర్ వెళ్లి వచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలనే మళ్ళీ పునరుద్ఘాటించి వచ్చారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో దళితులకు స్థానం లేదా? ముఖ్యమంత్రి కార్యాలయంలోకి దళిత అధికారాలకు ప్రవేశం లేదా? అన్న విమర్శలకు సమాధానంగా ఆగష్టు 16 న దళిత బంధు ప్రారంభ వేదిక నుంచే, ఐఏఎస్ అధికారి రాహుల్ బోజ్జాను, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకుంటున్నట్లు ప్రకతించారు. నిజానికి, అధికారుల నియామకాలు, బదిలీలు బహిరంగ వేదికల నుంచి ప్రకటించవలసిన ఆవసరం లేదు, అయినా ముఖ్యమంతి కేసేఆర్, రాహుల్ బొజ్జా నియామకం విషయాన్ని బహిరంగ వేదిక నుంచి ప్రకటించడమే కాకుండా, రాహుల్ తండ్రి బొజ్జా తారకాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన గుణగణాలను ప్రశంసించారు. అంటే, రాహుల్ బొజ్జా నియామకం రాజకీయ అప్పాయింట్మెంట్ అని చెప్పకనే చెప్పారు;. ఆ విధంగా ఏడేళ్ళుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో దళిత అధికారులు ఎందుకు లేరన్న విమర్శకు సమాధానం ఇచ్చారు.
ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా విపక్షాల విమర్శలకు మాటలతో కుండా చేతలతో సమాధానం ఇస్తూ వస్తున్న కేసీఆర్, దళిత ఉప ముఖ్యమంత్రి ఏరన్న ప్రశ్నకు, విస్తరణ ద్వారా జవాబు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, మంత్రివర్గ విస్తరణ/ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు, ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్’ కు ప్రమోషన్ ఇచ్చి సింపుల్ ‘గా కానిస్తారా లేక పనిలో పనిగా కొత్త వారికి అవకాశం కల్పించడంతో తోపాటుగా ప్రస్తుత మంత్రుఅలలో కొదరికి ఉద్వాసన పలకుతారా అనే విషయంలోనూ స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. అలాగే, మత్రివర్గంలో ఉద్యమ ద్రోహులే ఎక్కువగా ఉన్నారనే విపక్షాలు, ఉద్యమ సంఘాలు చేస్తున్న మరో ప్రధాన విమర్శకు కూడా మౌనంగాగానే సమాధానం ఇస్తారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం తప్పక ఉంటుందని, దళిత ముఖ్యమంత్రి పదవి పునరుద్ధరణ కూడా తప్పక జరుగుతుందని,అది కూడా ఆగష్టు 30 లోగానే ఉంటుందని సన్నిహిత వర్గాల పక్కా సమాచారం.