గుండెపోటు వార్తలపై సీబీఐ ఆరా! వివేకా హత్య కేసులో మరో మలుపు
posted on Aug 11, 2021 @ 2:42PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసు విచారణ పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా మరోసారి వైఎస్ వివేకా గుండెపోటు చిత్రీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. వివేకా చనిపోయిన రోజు మొదట ఆయన గుండెపోటుతో మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయనది హత్యగా తేలింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో నాటి గుండెపోటు చిత్రీకరణ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ఎలా ప్రసారం చేశారని సాక్షి ప్రతినిధిని ప్రశ్నించినట్లు సమాచారం. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలను కూడా గుండెపోటు వ్యవహారంపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది
మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్పటికే అనేక మంది అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.ఆ అతిథి గృహానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో అధికారులు రావడం ఆసక్తిగా మారింది. కర్ణాటక రెవెన్యూ, బ్యాంకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. వారంతా వచ్చి సీబీఐ అధికారులను కలిసి పలు అంశాలను వివరించారు. ఆ తర్వాత సీబీఐ అధికారులతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కడప ఎస్‌బీఐకి చెందిన ముగ్గురు అధికారులను సీబీఐ విచారించింది.
మరోవైపు కడపలో సీబీఐ అధికారులను వివేక కూతురు, అల్లుడు కలిశారు. అనంతరం కొందరు అధికారులు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ఇటీవల గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులపై అతడి కుటుంబ సభ్యులు ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారిని సీబీఐ అధికారులు కలిసినట్లు తెలుస్తోంది. పులివెందులలో సునీల్ నివాసానికి సీబీఐ అధికారులు వెళ్ళారు. ఇటీవల సునీల్ కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించడంపై వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆరోజు ఎవరెవరు ఇంటికి వచ్చింది.. అలాగే సీబీఐకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయంపై.. అధికారులు సునీల్ కుటుంబ సబ్యులతో సీరియస్‌గా చర్చించినట్లు తెలియవచ్చింది. సీబీఐ అధికారులు తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని సునీల్ కుటుంబ సభ్యులు తెలిపారు.