మోదీని ఓడిద్దాం.. మాజీల ఐక్యతారాగం..
posted on Aug 12, 2021 @ 9:15PM
ఒకప్పుడు వారంతా దేశ రాజకీయాలలో కీలక పాత్రను పోషించిన నాయకులు. సిద్ధాంతపరంగా సోషలిస్టులు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలిచిన నాయకులు. ముఖ్యంగా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అరాచక పాలనకు వ్యతిరేకంగా సాగిన మరో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు. ఈ నాయకులే 1970 దశకంలో జయ ప్రకాష్ నారాయణ్ (జేపీ) నేతృత్వంలో సాగిన, సంపూర్ణ క్రాంతి పోరాటంలో కీలక పాత్రను పోషించారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించి నిలిచిన అప్పటి యువ నేతలు. ఇప్పుడు వృద్ధ నాయకులు. అయినా ఇంకా వారిని రాజకీయ వాసనలు వదలేదు. ఇంకా ఏదో చేయాలని, ఏదో చూడాలనే తాపత్రయం వారిని వెంటాడుతూనే ఉంది.
అవును, మాజీ ప్రధాని దేవేగౌడ (88), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ (81), జేడీయూ బహిష్కృత నేత, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్, (76), అంతగా పరిచయం అవసరం లేని, వృద్ధ నేతలలో యంగ్ స్టార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్రనేత లాలూప్రసాద్ యాదవ్ (73). వీరంతా వయసు మీద పడినా ఇంకా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు తరచూ ఒకరినొకరు కలుస్తూ, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటున్నారు. అంతేకాదు వ్యక్తిగత యోగక్షేమాలతో పాటుగా, రాజకీయ మంచి చెడుల మీద చర్చలు సాగిస్తున్నారు.
ఒకప్పుడు వీరంతా జేపీ సృష్టించిన జనతా పార్టీలోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఎవరికీ వారు విడిపోయారు. సొంత కుపంట్లు పెట్టుకున్నారు.జనతా పరివారంగా మిగిలి పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకుంటున్నారు. కలుసుకున్న ప్రతిసారి, రాజకీయాలు చర్చకు వస్తూనే ఉన్నాయి.
ఈ వృద్ధ నేతలు ముఖ్యంగా, ప్రధాని మోడీని తమకు, తమ పరివారానికి ముప్పుగా చూస్తున్నారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు మోడీ నుంచి పొంచి ఉన్న ముప్పును తల్చుకుని, కుమిలి పోతున్నారు. అందుకే, మోడీ విసురుతున్న రాజకీయ సవాళ్ళ చుట్టూనే వీరి ఆలోచలు సాగుతున్నాయి. ఇప్పటికే, మోడీ, జనతా పరివార్ కోటలను చాలా వరకు కూల్చి వేశారు. యూపీలో ములాయం పార్టీ వరస ఓటములను రుచి చూస్తోంది. కర్ణాటకలో దేవెగౌడ, అయన కుమారుడు కుమార స్వామి రాజకీయ భవిష్యత్ గురించి కలత చెందుతున్నారు. అలాగే, లూలు. ఒకప్పుడు వీరంతా కూడా, ప్రస్తుత బీజేపీ పూర్వరూపం భారతీయ జన సంఘ్, (బీజేఎస్) తో చెట్టాపట్టాలేసుకు తిరిగినవారే, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన వారే, అయినా, ఇప్పుడు బీజేపీ పొడ గిట్టదు.
అవును, మాజీ సోషలిస్ట్ నాయకులకు, మోడీ ఎదుగుదల అసలు మింగుడు పడడం లేదు. ఈ విషయంలో సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ఎవరి కష్టాలు వారివిగా ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ విషయాన్ని తీసుకుంటే, ఆయన సారధ్యంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సమాజ్ వాదీ పార్టీ వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో దిక్కు దివాణం లేకుండా పోయింది. అలాగే, 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనంగా ఓడి పోయింది. బీజేపీ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీతో గెలిచింది. కర్ణాటకలో దేవే గౌడ పార్టీ జనతా దళ (ఎస్) బీహార్’లో లాలూ పార్టీ ఆర్జేడీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఇక శరద్ యాదవ్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. మోడీతో తిరిగి చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన ఆయన్ని, బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నుంచి బహిష్కరించారు. ఇలా, మాజీ సోషలిస్టు నాయకులకు బీజీపీ ఎదుగుదల మింగుడుపడని మహా కషాయంగా మారింది.
ఇదలా ఉంటే, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద యాదవ్ కామన్ కష్టాలతో పాటుగా, సోనియాగాంధీ ఇతర ప్రాతీయ కుటుంబ పార్టీల నాయకులు పేస్ చేస్తున్న కుటుంబ వారసత్వ పరిరక్షణ పరంగానూ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే శరద్ యాదవ్ కుల గోత్రాల పట్టిపులు, పార్టీలు, సిద్దాంతాలను పక్కన పెట్టి, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒకటై పోయి, బీజీపీ, ఆర్ఎస్ఎస్ ముప్పు నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు ఆయన ములాయం, లాలూ , దేవే గౌడతోనూ చర్చలు జరిపారు. ఏమైనా, చీలికలు, పేలికలుగా చీలిపోయిన జనతా పరివారం మోడీ భయంతో మరోమారు ఏకమవుతున్నారు. ఇప్పడు, దేశ రాజకీయాలలో వినిపిస్తున్న ఒకే ఒక్క మంత్రం మోడ... అందుకు ప్రతి ధ్వనిగా వినిపిస్తున్న నినాదం విపక్ష్ల ఏకత. వయసుతో విశేషణాలతో సంబంధం లేకుండా విపక్ష నాయకులు అందరి నోటా వినిపిస్తున్న మాట.. మోడీని ఓడిద్దాం...