పీకేకు ఆతిథ్యం.. తహశీల్దార్ పై బదిలీ వేటు
posted on Aug 11, 2021 @ 7:36PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ కుమార్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు ఓ తహశీల్దార్ పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ పొడపంగి రాధపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆమెను పెద్దఅడిశర్లపల్లి మండలానికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో పెద్దఅడిశర్లపల్లి తహసీల్దార్ దేవదాసును నియమించారు.
రెండేళ్లుగా నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రాధ.. స్వేరో సంస్థ కార్యక్రమాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత ఆయనకు మద్దతుగా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ప్రవీణ్‌కుమార్ నార్కట్‌పల్లికి వచ్చిన సందర్భంగా ఆమె భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఖమ్మంలో జరిగిన సమావేశం అనంతరం హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యలో నార్కట్‌పల్లిలోని ఓ హోటల్‌లో 400మంది కార్యకర్తలతో ప్రవీణ్‌కుమార్ సమావేశంకాగా, తహసీల్దార్ రాధ అక్కడే ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.
ఈ నెల 8వ తేదీన నల్గొండలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభతో పాటు అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో రాధ చురుగ్గా పాల్గొన్నందునే బదిలీ వేటు పడిందని చర్చ సాగుతోంది. బుధవారం కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ రాధ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకుని తక్షణం రిలీవ్ అయ్యారు. నల్గొండలో జరిగిన సభలో బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు. పీకే ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలో స్వేరో సంస్థకు చెందిన సంపత్ అనే వ్యక్తి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు ఫోన్ చేసి నిలదీసిన ఆడియో వైరల్ గా మారింది. ప్రవీణ్ కుమార్ విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఉన్నారనే చర్చ సాగుతోంది. అందుకే ఆయనకు మద్దతుగా ఉన్నవారిపై వేటు వేస్తున్నారని భావిస్తున్నారు.