వివేకా హత్యకు వాడిన ఆయుధాలు లభ్యం.. ఇద్దరు ప్రముఖులు వాళ్లేనా?
posted on Aug 11, 2021 @ 9:04PM
మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్యకు నిందితులు వాడిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్ల ఇండ్లలోనే ఆయుధాలు దొరికాయి. ఏక కాలంలో నలుగురు ఇండ్లలో సోదాలు చేసిన సీబీఐ అధికారులకు.. వివేకాను చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ తమ్ముడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు సీబీఐ అధికారులు. సునీల్ యాదవ్ పాసు పుస్తకాలతో పాటు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫోన్ నెంబర్లతో కూడిన డైరీని కూడా సునీల్ నివాసంలో సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇప్పటికే అనేక మంది అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇటీవలే గోవాలో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసింది. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మొదట కేసుతో తనకు సంబంధం లేదని బుకాయించిన సునీల్.. సీబీఐ అధికారుల విచారణలో అసలు నిజం అంగీకరించారని తెలుస్తోంది. ప్రత్యేక టీంలుగా వచ్చిన అధికారులు ఒకే సమయంలో పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. వారితో పాటుగా.. జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు.
సునీల్ యాదవ్ సీబీఐ విచారణలో .. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తు లేదని చెప్పడంతో తనదైన శైలిలో విచారణ నిర్వహించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమాచారం మేరకు ఈ రోజు నాలుగు చోట్ల ..అనుమానితుల నివాసాల్లో సోదాలు చేయగా.. అక్కడ హత్యకు వినియోగించిన ఆయుధాలు దొరికినట్లుగా తెలుస్తోంది. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సీబీఐ అధికారులు.. తమను సునీల్ తప్పు దోవ పట్టించాడని నిర్ధారణకు వచ్చారు.
2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఆ తరువాత విచారణ సమయంలోనూ...రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ గత నాలుగు రోజులుగా విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ వ్యక్తిగత సిబ్బందితో పాటుగా ఒక పత్రిక కు చెందిన ప్రతినిధులను సీబీఐ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ను పులివెందులలోని పలు చోట్లకు తిప్పుతూ వివరాలు సేకరిస్తున్నారు. రహస్యంగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు సునీల్ అసలు విచారణలో ఏంచెప్పాడనే విషయం మాత్రం బయటకు పొక్కనీయటం లేదు.