హరీశ్ వర్సెస్ ఈటల.. పొలిటికల్ సవాల్స్.. ఎవరికి బూమరాంగ్?
posted on Aug 12, 2021 @ 5:30PM
18 ఏళ్ల అనుబంధం. జాన్ జిగ్రీ దోస్తులు. కేసీఆర్ పుణ్యాన ఇప్పుడు బద్ద శత్రువులు. హుజురాబాద్‌లో ఎవరి దమ్మెంతో తేల్చుకునే పనిలో పడ్డారు. ఈటలను ఓడించే టాస్క్ హరీష్‌కే అప్పగించి.. టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ కొట్టాలనిచూస్తున్నారు కేసీఆర్. మిత్రుడిపైకి మిత్రుడినే ఉసిగొల్పి.. అల్లుడి నిబద్ధతకు అగ్నిపరీక్ష పెట్టారు. తాను నిలువెల్లా కాలిపోతున్నా.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాధించడానికి బాగానే ట్రై చేస్తున్నాడు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించగానే. భారీ ఎత్తున బైక్ ర్యాలీ తీసి.. బలప్రదర్శనకు దిగారు. గారు..గారు.. అంటూనే ఈటల గుండెల్లో మాటల ఈటెలు గుచ్చారు. రాజేందరేమైనా తక్కువోడా. మీరు..మీరు.. అంటూ హరీశ్‌పై సైతం అవే ఈటెలను ప్రయోగించి ఈటల పదునెంతో చూపించారు. ఇద్దరు పాత దోస్తులు..కొత్త దుష్మన్‌ల మధ్య రాజకీయ పోరు రంజుగా మారింది. హరీశ్ డైరెక్ట్ ఎంట్రీతో హుజురాబాద్ సినిమా.. ఈలలు గోలలతో బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది.
టీఆర్ఎస్‌లోకి రాకముందు ఈటల సర్పంచా? ఎమ్పీటీసీనా? జెడ్పీటీసీనా? ఎమ్మెల్యేనా? అని ప్రశ్నించారు హరీశ్. రాజేందర్‌కు కేసీఆరే రాజకీయ బిక్ష పెట్టారని ఎద్దేవా చేశారు. సేమ్ టూ సేమ్.. అవే ప్రశ్నలు తిరిగి హరీశ్‌పైకి సంధించారు ఈటల. నా సంగతి సరే.. మరి మీరు.. టీఆర్ఎస్‌లోకి రాకముందు సర్పంచా? ఎమ్పీటీసీనా? జెడ్పీటీసీనా? ఎమ్మెల్యేనా? అంటూ హరీశ్‌రావును నిలదీశారు రాజేందర్. తన డైలాగ్ తనకే బూమరాంగ్ అవుతుందని హరీశ్ ఊహించి ఉండకపోవచ్చు. రాజకీయాల్లో అంతా ఆ తాను ముక్కలేనని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ హరీశ్, ఈటల క్వశ్చన్స్.
హుజురాబాద్‌లో 2 గుంటలకు.. 2 వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందంటూ ఈటల సంపదను బూచీగా చూపించే ప్రయత్నం చేశారు హరీశ్‌రావు. దీనిపైనా రాజేందర్ ఖతర్నాక్ కౌంటర్ వేశారు. టీఆర్ఎస్‌లోకి రాకముందే తాను బడా పారిశ్రామికవేత్తనని.. లక్షల సంఖ్యలో కోళ్లు ఉన్న ఫౌల్ట్రీ ఫాములు, వందల ఎకరాల భూములున్న ఆసామినంటూ చెప్పుకొచ్చారు ఈటల. 2001 నుంచి 2021 వరకూ నా ఆస్తులు ఎంత పెరిగాయో లెక్కలేద్దామని.. అదే సమయంలో 2001లో మీ ఆస్తులు, ఇప్పుడు మీకున్న ఆస్తులు ఎంతో.. సీబీఐతో గానీ, మెజిస్ట్రేట్‌తో గానీ విచారణకు సిద్ధమా? అంటూ హరీశ్‌కు సవాల్ విసిరారు ఈటల రాజేందర్. దెబ్బకు దిమ్మ తిరిగి ఉంటుంది హరీశ్‌రావుకు.
అన్నేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటల హుజురాబాద్‌ను డెవలప్ చేయలేకపోయారంటూ హరీశ్‌రావు విమర్శించారు. ఇక్కడ కూడా రివర్స్ పంచ్ ఓ రేంజ్‌లో పడింది. అయ్యా.. హరీశ్‌రావు గారు.. నేను వేయించిన 4 లైన్స్ రోడ్ల మీదుగానే తమరు హుజురాబాద్‌లో పర్యటించారంటూ అదిరిపోయే పంచ్ వేశారు ఈటల రాజేందర్. ఇలా, హరీశ్‌రావు వర్సెస్ ఈటల రాజేందర్.. ఎపిసోడ్ హుజురాబాద్‌తో పాటు యావత్ తెలంగాణలో కాక రేపుతోంది.