టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు? మరో ఉప ఎన్నికకు పార్టీలు రెడీ?
posted on Aug 11, 2021 @ 3:41PM
తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో త్వరలో మరో ఉప ఎన్నిక కూడా రాబోతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే మరో ఉప ఎన్నిక రాజకీయ పార్టీలు సిద్ధం కావాల్సిందే. కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నానుతున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కేసులో తీర్పు త్వరలో వెలువడబోతోంది. ఈ కేసులో మంగళవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు 24న పూర్తి విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో 24న ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వంపై తీర్పు వెలుడనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో ఎమ్మెల్యే పౌరసత్వంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వేములవాడ అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంతో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తోంది. ఆయన 2019 లో బెర్లిన్లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ తీసుకున్నారని మరియు OCI కార్డ్ కోసం తన దరఖాస్తులో జర్మనీగా పేర్కొన్నాడని ఆయనపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ తరపున న్యాయవాది రవికిరణ్ రావు కోర్టులో తెలిపాడు. ఎమ్మెల్యే OCI కార్డుపై భారతదేశానికి వచ్చారని జర్మన్ పాస్పోర్ట్తో జర్మనీ వెళ్లొస్తున్నారని అన్నారు. 2009 లో భారతీయ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు చెల్లుబాటు అయ్యే జర్మన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడన్నారు. ఓ వైపు భారతీయుడినని చెప్పుకుంటూనే 2023 వరకు జర్మన్ పాస్పోర్ట్ను పునరుద్ధరించాడని అయితే భారతీయ పాస్పోర్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ఇరువాదలను విన్న కోర్టు చెన్నమనేని న్యాయవాదిని OCI కార్డులో జర్మనీగా ఎందుకు పేర్కొనారని ప్రశ్నించింది. అలాగే ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24నకు వాయిదా వేసింది. కోర్టు ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే గతంలో చెన్నమనేని పౌరసత్వం రద్దయితే రెండో స్థానంలో ఉన్న వారిని ఎన్నుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కోర్టు మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో 2018లో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా... వరుసగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలన్ని రాజకీయ కాక రేపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2019మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్,టీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఉత్తమ్ కంచుకోటలో ఆయన సతీమణిని చిత్తుగా ఓడించి సంచలనం నమోదు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ.
దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవడంతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020 నవంబర్ లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా, టీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకునే దుబ్బాకలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని అధికార పార్టీకి చెమటలు పట్టించింది. చివరకి దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలనం స్పష్టించారు. దుబ్బాక ఫలితం కారు పార్టీని కంగారులో పడేసింది. తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య చనిపోవడంతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 ఏప్రిల్ లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా రాజకీయ సెగ రాజేసింది. నాగార్జున సాగర్ లో మూడు పార్టీలు శ్రమించాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీసిన కేసీఆర్.. సక్సెస్ అయ్యారు. రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డిపై నోముల తనయుడు భగత్ అనూహ్య విజయం సాధించారు.
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే హుజురాబాద్ ఉప సమరం వేడెక్కింది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.