షా ఇటు, గవర్నర్ అటు.. ఏదో జరుగుతోంది? కేసీఆర్‌కు చెక్ పెడుతున్నారా?
posted on Aug 12, 2021 @ 1:44PM
తెలంగాణలో ఏదో జరుగుతోంది. అవును, హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే రాష్ట్ర రాజకీయం చక్కర్లు కొడుతోంది. ఇది అందరికీ తెలిసిన, అందరూ అంటున్న, వింటున్న మాట. నిజమే, ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, అదే మాట్లాడుకుంటున్నారు. కమ్ముకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ కంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికే, అందరి నోటా నలుగుతోంది. ఇది పైకి కనిపిస్తున్న రాజకీయం, కనిపించని కథ ఒకటి తెరచాటున నడుస్తున్నదని రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. ఈటల విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకున్నారని రాజకీయ వర్గాలలో కొత్త చర్చ ప్రారంభమైంది. ఈటల రాజకీయంగా హతమార్చే కుట్రలో భాగంగా, ముఖ్యమంత్రి తెలియకుండానే, కేంద్రం ఉచ్చులో చిక్కుకున్నారని కూడా రాజకీయ, మీడియా వర్గాలలో చర్చ మొదలైంది. ఒక విధంగా, అయన గొయ్యి ఆయనే తవ్వుకున్నారని, పులినోట్లో తల పెట్టారని అంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం నుంచి తొలిగించాలనుకుంటే, అదేమీ పెద్ద విషయం. కాదు, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే సారి ఏకంగా డజను మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. అందులో ఒకరో, ఇద్దరో ఆ.. ఊ అన్నా, కొంపలు ఏమీ అంటుకోలేదు. పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీకి ఏమాత్రం తీసిపోరు. సో, అదే విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ పేరున ఈటలను ఇంటికి పంపితే, ఆ కథ అక్కడితో ముగిసి పోయేది. అలా కాకుండా, కుక్కను కొట్టిచంపే ముందు పిచ్చిదనే ముద్ర వేయాలన్న అరాచక ఆచారాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి ఈటలపై అవినీతి ముద్ర వేసి బయటకు గెంటారు.
ఇప్పుడు ఆ చిన్న తప్పు పెద్ద ఉప ద్రవానికి దారి తీసినట్లు కనిపిస్తోంది. అసలే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం మీద కన్నేసింది. తెలంగాణలో బలాన్ని పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా, పనిలో పనిగా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, కేసీఆర్ ఉమ్మడి కుటుంబ ఇంటి గుట్టును, అవినీతి భాగోతాలను బయటకు తీసి, సరైన సమయంలో కొరడా తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అందుకే, ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి శాంతి జపాలు చేయించుకు వచ్చారు. అయినా, మళ్ళీ తెలిసో, తెలియకో ఈటలను గిల్లి, కేంద్రంతో కయ్యానికి తెర తీశారు.
ఇప్పుడు ఆ కయ్యం తాలుకు ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు పార్లమెంట్ సమావే శాల కారణంగా రాజకీయాలను పక్కన పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం, తాజాగా తెలంగాణపై దృష్తి పెట్టిందని, అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్’ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. విపక్షాల గోలతో, రెండురోజుల ముందుగానే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో, ఏ మాత్రం సమయం వృధా చేయకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి అమిత్ షాతో సమావేశ మయ్యారు. ప్రధానమంత్రితోనూ సమావేశమవుతారని సమాచారం.
అదలా ఉంటే , గవర్నర్ తో సమావేశం ముగిసిన వెంటనే హోమ్ మంత్రి అమిత్ షా, శ్రీశైలం వయా హైదరాబాద్ పర్యటన ఫిక్స్ అయింది. గవర్నర్ ఢిల్లీ పర్యటన, హోమ్ మంత్రి శ్రీశైలం వయా హైదరాబాద్ యాత్ర అంతర్యం ఏమిటనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంట చోటు చేసుకుంది. ఒక విధంగా ఇది రాష్ట్ర రాజకీయాలపై ఏరియల్ సర్వే అనుకోవచ్చని, బీజేపీ నాయకుడు ఒకరు జోక్ లాంటి నిజం చెప్పారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసేఆర్’కు ముక్కుతాడు బిగించడం కోసమే, కేంద్ర ప్రభుత్వం గవర్నర్’ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం, అతని పై ఉన్న కేసులు, అదే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీల ఖరారు వ్యవహారం, ఈ అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబ అవినీతికి సంబదించిన సమాచారం, ఇత్యాదులు అన్నీ ఢిల్లీ చేరాయని అంటున్నారు.
ఏది ఏమైనా, ఈటల రాజేందర్’కు గతంలో ఇచ్చిన మాట ప్రకారం హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ పనైపోగానే, హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు.. ఇక ముందు జరిగే కథ ఇంకోఎత్తు.. అసలు ఆట ఇప్పుడే మొదలైందంటున్నారు కమలనాథులు.