మనోళ్లేగా కేసులు ఎత్తేయ్!.. సుప్రీం ఆదేశాలతో వైసీపీ షేక్...
posted on Aug 12, 2021 @ 1:01PM
చట్టం ఎవరికీ చుట్టం కాదంటారు. ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లో మాత్రమే వినిపిస్తాయి. రియల్‌గా చట్టంలోని లూప్‌హోల్స్‌ను తమ చుట్టంగా మార్చేసుకుంటున్నారు పాలకులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదవుతాయి. అధికారంలోకి రాగానే అవన్నీ మాఫీ అవుతాయి. ఇవి రాజకీయాల్లో కామనే. ఇకపై అలాంటివి కుదరదంటూ నాయకులపై క్రిమినల్ కేసులు చిట్టా విప్పుతోంది సుప్రీంకోర్టు. దీంతో.. అధికార వైసీపీలో గుబులు మొదలైంది. అదెక్కడ తమ మెడకు బిగుసుకుంటుందోననే టెన్షన్ మొదలైంది. హైకోర్టు అనుమతి లేకుండా ఎత్తేసిన కేసుల విషయంలో అధికార పార్టీ నేతల్లో ఆందోళన రేపుతోంది.
జగన్ సీఎం కాగానే.. పలువురు అధికారపక్ష నేతలపై ఉన్న పలుకేసులను ఉన్నపళంగా ఎత్తేశారు. అందుకు సీఎం జగన్ సైతం మినహాయింపు కాదు. జగన్‌పై ఉన్న 15 కేసులు ఉపసంహరించుకోవడంపై విమర్శలు వచ్చాయి. జగన్‌తో పాటు మరో 8 మంది కీలక నేతలపై ఉన్న 30 వరకూ కేసుల్ని మూసేయడంపై ప్రతిపక్షం మండిపడినా పట్టించుకోలేదు. కానీ, తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో వారందిరి గుండె దడ పెరిగింది. మళ్లీ తమపై కేసులు పెడతారా? అనే ఆందోళన నెలకొంది. ఇంతకీ ఆ ఎనిమిది మంది నేతలు ఎవరు? ఆ కేసులు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
కేసుల విత్‌డ్రాలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను టాప్‌లో ఉన్నారు. అత్యధికంగా 10 కేసులు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాతి స్థానం వైసీపీ లోక్‌సభ పక్ష నేత అయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయనపై ఉన్న మూడు కేసుల్ని ఎత్తేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద రెండు కేసులు.. ఎంపీ అవినాష్‌రెడ్డి, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేశ్, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డిలపై ఒక్కొక్క కేసును ఉపసంహరించుకున్నారు.
ఆయా నేతలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసుల వివరాల మేరకు....
మిథున్‌రెడ్డి..
- 2009లో ఎంవీ క్రిష్ణారెడ్డి, మరో నలుగురితో వెళుతున్న వాహనాన్ని అడ్డగించి రక్తం వచ్చేలా గాయపరిచారు.
-15 మందికి బోర్డింగ్ పాసులు ఇవ్వాలని కోరితే ఇవ్వనందుకు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్‌పై దౌర్జన్యానికి దిగారు.
-2015లో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండానే పీహెచ్‌సీని ప్రారంభించి అక్రమ చొరబాటుకు పాల్పడ్డారన్న అభియోగం.
జక్కంపూడి రాజా
-పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా నిర్వహించిన భారత్ బంద్‌లో రాజమండ్రిలోని స్పెన్సర్ షాపు మేనేజర్‌ను దుర్భాషలాడి కొట్టారు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన తనను తిట్టి అంతు చూస్తానని బెదిరించినట్లుగా సుబ్రమణ్యేశ్వరరావు అనే ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు.
-పోలీసు అధికారుల్ని బెదిరించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
వైఎస్ అవినాశ్‌రెడ్డి
-2015లో బెదిరింపు.. ఉద్యోగుల అడ్డగింత అభియోగంపై కేసు నమోదు
పేర్ని నాని
-2015లో బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డటం.. ప్రభుత్వ ఉద్యోగినిని విధులు నిర్వర్తించకుండా బలప్రయోగం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు.
జోగి రమేశ్
-2017లో నందిగామ దగ్గర జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో మరణించిన వారి డెడ్ బాడీలను వారి కటుంబ సభ్యులకు అప్పగిస్తున్న వేళ..చట్టవిరుద్దంగా గుమిగూడారన్న ఆరోపణతో కేసు నమోదు
కాకాణి గోవర్ధన్ రెడ్డి
-మాజీ మంత్రి సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఫోర్జరీ పత్రాల్ని క్రియేట్ చేసి మోసం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు.
గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి
-2019లో ఎన్నికల పోలింగ్ రోజున అహోబిలం ప్రభుత్వం పాఠశాల దగ్గర బ్రిజేంద్రనాథ్ వర్గం.. భార్గవ్ రామ్ వర్గం చట్టవిరుద్ధంగా పరస్పరం కర్రలు.. రాళ్లు విసురుకొని దాడి చేసుకున్నారన్న ఆరోపణ.