ఆయన అడ్డుకున్నా గెల్లుకు ఇలా టికెటొచ్చింది..
posted on Aug 12, 2021 @ 4:35PM
హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పెను సాహసమే చేస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఎక్కడా పేరు వినిపించని సాదాసీదా యువ నాయకుణ్ని ప్రకటించడం సాహసమే అంటున్నారు నిపుణులు. ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ లాంటి సీనియర్ ను ఢీకొనేందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంటి యూత్ లీడర్ను ఎంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఒకవైపు పీడిస్తుండగా.. గెల్లుకు టికెట్ కన్ఫామ్ అవడానికి కూడా పార్టీలోని కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని అత్యంత విశ్వసనీయ సమాచారం.
గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కన్ఫామ్ చేసి విపక్షాలతో ఓటాట ఆడేందుకు మైదానానికి రమ్మని సవాల్ చేశారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. దీంతో కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి రూట్ క్లియర్ అయిపోయింది. ఇప్పటివరకూ అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది తేలకపోవడంతో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఆయన భార్య జమున మధ్య ఊగిసలాటలో ఉన్నారు. అయితే ఇటువైపు గెల్లుకు టికెట్ ఖాయమవడంతో బీజేపీ నుంచి ఈటలనే కన్ఫామ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఈటలతో పాటు గెల్లు శ్రీనివాస్ సైతం ఎదురుదెబ్బలు తిన్నారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకెళ్లారు. ఇలా ఈటలకు దాదాపుగా సమానమైన క్యారెక్టర్ గెల్లుకు ఉందన్న ఉద్దేశంతో గెల్లునే కన్ఫామ్ చేసింది అధిష్టానం. అయితే టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోనే పనిచేసి, గతంలో ఎంపీగా పనిచేసిన ఓ యువనేత గెల్లుకు టికెట్ కన్ఫామ్ చేయడాన్ని అడ్డగించినట్టు విశ్వసనీయ సమాచారం. గెల్లుతో పాటు ఆ యువ నేత కూడా విద్యార్థి విభాగం నుంచి వచ్చినవారే కావడంతో అధిష్టానం ముందు గెల్లు మీద నెగెటివ్ ప్రాపగాండా చేశాడని, ఆయనకు టికెట్ ఇస్తే విపక్షాలకు అమ్ముడు పోవడం ఖాయమని, గెల్లు అంతగా నమ్మదగిన వ్యక్తి కాదని... ఇలా ఒకటికి నాలుగు కల్పించి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధిష్టానం మాత్రం... అన్నీ ఆలోచించే గెల్లును బరిలోకి దించడం విశేషం.
ఇక మరో విశ్వసనీయ సమాచారం ప్రకారం 2018 ఎన్నికల్లోనే గెల్లును హుజూరాబాద్ నుంచి పోటీలో దింపితే ఎలా ఉంటుందని లోలోపల చర్చ జరిగినట్లు ఆనాడే మీడియాకు లీకులొచ్చాయి. అయితే ఈటల మీద అధిష్టానానికి ఆ రోజుల్లోనే ఆగ్రహం ఉన్నా... పార్టీ నుంచి బహిష్కరించే స్థాయిలో లేకపోవడం, ఒకవేళ బహిష్కరిస్తే ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించకపోవడంతో అప్పట్లో ఈటలపై వేటును లైట్ తీసుకున్నారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఈటలకు మంత్రివర్గంలో చోటు దక్కపోవడాన్ని గుర్తించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ విధంగా అప్పట్లోనే అధిష్టానం దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్న గెల్లు... అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం కాస్తా ఉపఎన్నిక రూపంలో ఇప్పుడొచ్చింది. మరి ఉపఎన్నికలో ఓడిపోతే గెల్లు పరిస్థితేంటన్న ప్రశ్న కూడా వస్తోంది. ఒకవేళ ఉపఎన్నికలో గెల్లు ఓడిపోయినా.. ఒకసారి పోటీ చేసి ఓడిన వ్యక్తిగా పాపులారిటీ వస్తుంది. అధికార పార్టీ సభ్యుడిగా విపక్షాలు, ప్రజలు, మీడియా గుర్తిస్తాయి. యువ నాయకుడి నుంచి ప్రధాన పార్టీ బాధ్యతల్లోకి మారే చాన్సొస్తుంది. రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు కావాల్సిన ప్రొఫైల్ డెవలప్ చేసుకునే అవకాశంగా ఈ ఉపఎన్నిక పనికొస్తుందంటున్నారు. ఒకవేళ గెల్లు గెలిస్తే సీనియర్ నాయకుడు ఈటల మీద గెలిచిన వ్యక్తిగా గెల్లుకు అనూహ్యమైన పాపులారిటీ రావడం ఖాయం.
మొత్తానికి హుజూరాబాద్ ఉపఎన్నిక... ప్రధాన పక్షాలైన బీజేపీ, టీఆర్ఎస్ ల నుంచి ఆ రెండు పార్టీల పోరాటం కన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల పోరాటంగానే ఉంటుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.