జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ఎటు వైపు? ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ?
posted on Aug 11, 2021 @ 7:36PM
కేంద్రంలో రాజకీయ సమీకరణలు చకచకా మారి పోతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 2024లో బీజీపీని ఓడించి, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా మమత మొదలు పవార్ వరకు, రాహుల్ మొదలు కపిల్ సిబల్ వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఎందుకనో గానీ ఒకప్పుడు మోడీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల కూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, హైదరాబాద్ నుంచే దండయాత్ర మొదలవుతుందని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఢిల్లీ కేంద్రంగా విపక్షాలు సాగిస్తున్న ప్రస్తుత సందడిలో మాత్రం ఇంతవరకు వేలు పెట్టలేదు. ఈ జాతరలో ఆయన ఎక్కడా కనిపించ లేదు, వినిపించ లేదు. కనీసంగా అయన పేరున కాకపోయినా పార్టీ పరంగా అయినా ఒక ప్రకటన కూడా లేదు.
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ జీ 23 నాయకుడు కపిల్ సిబల్ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెరాస నాయకులు హాజరైనట్లు కొన్ని పత్రికలలో ఓ చిన్నవార్త అయితే వచ్చింది. కానీ, కపిల్ సిబల్ ఎవరికి ఆహ్వానం పంపించారు, తెరాస తరపున విందులో పాల్గొన్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు, ఒక మాజీ ఎంపీ సహా కేసీఆర్’కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఇద్దరు కీలక నాయకులు ఈ విందు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అంతేకాదు, కేసీఆర్ కూడా అటు మమతతో, ఇటు పవార్ తో అలాగే కాంగ్రెస్ నాయకులతో టచ్ లోనే ఉన్నారని సమాచారం.
కపిల్ సిబల్ విందులో పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలో జరుగతున్న విపక్షాల ఐక్యతా దిశగా తెరాస తొలి అడుగు వేసింది. అయితే ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అందుకే, కేసీఆర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నా,నిజానికి ఇప్పటికిప్పుడు, జాతీయ జాతరలో ప్రత్యక్షంగా పాల్గొనే ఆలోచన తెరాసకు లేదు.అందుకే, కపిల్ సిబాల్ విందులో పాల్గొన్న విషయాన్ని కూడా రహస్యంగా ఉంచిందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఢిల్లీలో ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది గులాబీ బాస్ ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అలాగే, రాష్ట్ర రాజకీయాలపై ఆ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ఆయన విశ్లేషణలు సాగిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి అయితే ఢిల్లీ పరిణామాలపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని కేసీఆర్ పార్టీ నాయకులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలనేది కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే తీవ్ర ముప్పును ఎదుర్కుంటున్న ప్రాంతీయ పార్టీల మనుగడకు మరింత ప్రమాదంలో పడుతుందని, కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా,కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వినా ప్రాంతీయ పార్టీలకు మరో మార్గం లేదని, ఎన్నికల వ్యూహకర్తః ప్రశాంత్ కిశోర్ చేసిన సూత్రీకరణతో కేసీఆర్ ఏకీభవించారని అంటున్నారు. అయితే, అదే సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచి కాదనే అభిప్రాయం కూడా ఉందని, అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే అది రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ఢిల్లీ వైపు మరో అడుగు వేసే విషయం అలోచిద్దామనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారని తెలుస్తోంది హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీ గెలిస్తే మాత్రం కేసీఆర్ కాంగ్రెస్’తో చేతులు కలుపుతారని, తెరాస గెలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒంటరిగానే ముందుకు సాగుతారని ఆ తర్వాతనే జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు వేస్తారని అంటున్నారు.
నిజానికి కేసీఆర్ స్నేహ సంబంధాలు క్షణాల్లో మారిపోతుంటాయి, 2001లో తెరాస ఏర్పడిన కొత్తలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. సుముఖత వ్యక్తం చేయడం మాత్రమే కాదు, రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయతో చర్చలు జరిపారు. కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే, కాంగ్రెస్’తో జట్టు కట్టారు. అలాగే గతంలో ఒక సారి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఫలితాలు రాక ముందే బీజేపీ జాతీయ నాయకులతో మంతనాలు జరిపిన విషయాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి, కేసేఆర్ మార్క్ రాజకీయాలు, అర్థం చేసుకోవడం కష్టం. ఆయన తాత్కాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆదరికీ అనుభవంలో ఉన్న విషయమే, సో రేపు కేసీఆర్ ఏమి చేస్తారో ఊహించడం అయ్యే పనికాదు..