పంటికింద రాయిలా రఘురామ.. వైసీపీలో ఆందోళన..
posted on Aug 12, 2021 @ 3:33PM
కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు. ఢిల్లీలో ఎక్కని గడప లేదు. వెళ్లని ఇల్లు లేదు. స్పీకర్ ఓం బిర్లా నుంచి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వరకూ.. అందరినీ కలుస్తున్నారు వైసీపీ ఎంపీలు. మా సీఎం జగన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న.. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎలాగైనా వేటు వేయండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. ఎందుకు వేయాలి అనే దానిపై సరైన సాక్షాలు మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో.. వైసీపీ నేతల కన్నీటికి.. కేంద్రంలో ఏ ఒక్క ప్రముఖుడూ కరిగిపోవడం లేదు. రఘురామపై అనర్హత వేటు పడటం లేదు.
ఈ లోక్‌సభ సెషన్‌కి రఘురామను హౌజ్‌లో అడుగుపెట్టకుండా చేద్దామని శతవిధాలా ప్రయత్నించారు. కానీ, వారి ఆశలు అడియాసలే అయ్యాయి. రఘురామ వైసీపీ ఎంపీగా సభలో భాగమయ్యారు. పలుమార్లు అధ్యక్షా అంటూ తన గొంతు బలంగానే వినిపించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్లమెంట్‌లో అందరికంటే ఎక్కువ ప్రశ్నలు అడిగిన వైసీపీ ఎంపీగా రఘురామనే టాప్‌లో నిలిచారు. ఈ పరిణామాన్ని ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది. ఆయనపై వేటు పడటం లేదని ఉడికిపోతోంది.
ఇక తనను ఏమీ చేయలేక పోతున్న వైసీపీని చూసి రఘురామ మరింత రెచ్చిపోతున్నారు. విమర్శల డోసు మరింత పెంచేశారు. మాటలతో పాటు చేతల్లోనూ దూకుడు పెరిగింది. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం.. ఆగస్టు 25న తీర్పు రాబోతుండటంతో పార్టీలో విపరీతమైన ఆందోళన. దాదాపు బెయిల్ రద్దు కన్ఫామ్ అనే వార్తలతో తీవ్ర కలవరం. జగన్‌కు చుక్కలు చూపిస్తోంది చాలదన్నట్టు.. నెంబర్ 2 అండ్ ఏ2.. విజయసాయిరెడ్డిని సైతం టార్గెట్ చేశారు రఘురామ. ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో వైసీపీలో ఉలిక్కిపాటు. ఓవైపు కేసులు నడుస్తుండగా.. మరోవైపు.. డైలీ రన్నింగ్ కామెంట్రీ యధావిధిగా కంటిన్యూ చేస్తున్నారు.
తాజాగా, న్యాయశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిరణ్ రిజిజును వైసీపీ ఎంపీలు కలిశారు. ఈ విషయం తెలిసి ఎంపీ రఘురామ వైసీపీ బృందంపై మరోసారి సెటైర్లు వేశారు. ఫిరాయింపు చట్టంలో సవరణలు చేయాలని కోరుతూ తమ ఎంపీలు కేంద్ర న్యాయమంత్రిని కలిశారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్ 10ని తాను ఉల్లంఘించడం లేదని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యల కోసం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి లేఖ రాసినట్టు చెప్పారు ఎంపీ రఘురామ.
కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకన్ననూ వదలడం లేదని.. టీటీడీ నుంచి రూ.50 కోట్లు తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనను మరోసారి ఆటాడుకున్నారు రఘురామ.