మోడీ గ్రాఫ్ ఢమాల్.. సంఘ్ పరివార్ లో టెన్షన్
భారతీయ జనతాపార్టీ ఒక విభిన్నమైన పార్టీ. ఇతర పార్టీలకు బీజేపీకి మధ్య కేవలం సిద్దాంత విబేధాలే కాదు, సంస్థాగత నిర్మాణం, నాయకులు, కార్యకర్తల నిర్మాణ, ఐడిలాజికల్ కమిట్మెంట్, మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం ఇలా ఎలా చూసినా బీజేపీ భిన్నమైన పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి మధ్యేవాద పార్టీలతో, బీజేపీని అసలే పోల్చలేము. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువయితే, బీజేపీలో క్రమ శిక్షణ కొంచెం చాలా ఎక్కువ. అయితే ఇది ఇప్పటి మాట కాదు, ఒకప్పటి మాట. ఇప్పడు బీజేపీ మరో కాంగ్రెస్ పార్టీ కాదంటే ఇంకొక పార్టీ అంతే. అంతకంటే, గొప్పగా చెప్పుకునేందుకు ఏ ప్రత్యేకత పార్టీకి మిగల లేదు. ఇంకా ఎక్కడో, కొద్ది మందిలో పాతవాసనలు ఉంటే ఉండవచ్చును కానీ, ఒక పార్టీగా మాత్రం బీజేపీ పాత, విలక్షణ లక్షణాన్ని, విలువలను కోల్పోయింది. ఉద్దేశ పూర్వకంగానే వదిలించుకుంటోంది. అందుకే ‘ఏ పార్టీ విత్ ఏ డిఫరెన్స్’ అనే ట్యాగ్ లైన్ బీజేపీకి చెరిగి పోయింది. అందుకే క్రమక్రంగా పార్టీ ప్రభ దిగజరిపోతోంది. కమల వెలుగు మసకబారి పోతోంది. ప్రధాని మోడీ గ్రాఫ్ కూడా డిమికీలు కొడుతోంది. దిగజారి పోతోంది.
ఇండియా టుడే, నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్’ తాజా సర్వేలో మోడీ పాపులారిటీ గత సంవత్సరంతో పోలిస్తే, ఇంచుమించుగా మూడింట రెండితలు పడిపోయింది. గత సంవత్సరం 66 శాతం మంది మోడీ పాలనను మెచ్చుకుంటే, ఈ సంవత్సరం కేవలం 26 శాతం మంది మాత్రమే మోడీకి ఓటేశారు. ఇలా ఒక్కసారిగా ప్రజాభిప్రాయం తిరగబడటానికి, కరోనా సెకండ్ వేవ్ కట్టిడిలో ప్రధాని వైఫల్యం ప్రధాన కారణంగా ప్రజాభిప్రాయంలో పాల్గొన్న ప్రజలు పేర్కొన్నారు. కరోనా ఫస్ట్ వేవ్’ను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సెకండ్ వేవ్ విషయంలో ఘోరంగా విఫలమైందని సర్వే నివేదిక స్పష్టం చేసింది. అందుకే గత (2021) జనవరిలో నిర్వహించిన సర్వే లో ఫస్ట్ వేవ్ విషయంలో ప్రధాని చూపిన చొరవను 73 శాతం మంది మెచ్చుకున్నారు. అదే సెకండ్ వేవ్ విషయానికి వచ్చే సరికి ఆ శాతం 46 శాతానికి పడిపోయింది.
ఎన్నికల ప్రచార సభలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల సందర్భంగా, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత షా సహా, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్న భారీ బహిరంగ సభలు కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి కారణమని 27 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అలాగే, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు కూడా మోడీ పాపులారిటీ పడిపోవడానికి కారణంగా సర్వే సూచిస్తోంది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఇప్పటికీ, ఉత్తమ ప్రధాని ఎవరంటే.. మోడీనే అంటున్నారు మెజారిటీ జనం. అయితే, అది చూసి మురిసి పొతే కుదరదు ముందుంది ముసళ్ళ పండగ అని సర్వే సూచిస్తోంది.నిజానికి, ఎన్నికల సహా సర్వేలు ఏవీ కూడా,వాస్తవ పరిస్టితిని నూటికి నూరు పాళ్ళు ప్రతిబింబించవు. కానీ, రైల్వే గైడ్ లాగా, కొంచెం అటూ ఇటుగా వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. దేశం మూడ్’, జనంనాడి ఎలా వుందో సంకేత మాత్రంగా అయినా సూచిస్తాయి. ఇండియా టుడే సర్వే సర్వే కూడా అదే చేసింది. మోడీ ప్రభుత్వం ప్రమాదం అంచుల్లోకి చేరిందని హెచ్చరిస్తోంది.
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ, కరోన ఫస్ట్ వేవ్ కట్టడి పై చూపిన శ్రద్ద సెకండ్ వేవ్ విషయంలో చూప లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా, మోడీ, షా జోడీ మిగిలిన్విష్యలు అన్నీ పక్కన పెట్టి పరుగులు తీశారు. కేంద్ర మంత్రులదీ అదే తీరు. నెలల తరబడి, బెంగాల్, మమత నమ జపం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, హుజూరాబాద్ మీదనే దృష్టి నిలిపిన విధంగా, అప్పుడు మోడీ, షా జోడీ బెంగాల్ పైనే దృష్టి కేంద్రీకరించారు. అయినా, వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా, బెంగాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ కారణంగా కరోనా కట్టడిలో విఫలమై, రెంటికి చెడ్డ రేవడిగా తేలారు. అయితే, కరోనా వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వానిది ఎంత బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వాలదీ అంతే బాధ్యత అంతే వైఫల్యం.
ఇండియా టుడే సర్వేలో కూడా 44 శాతం మంది ప్రజలు కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిదీ సమాన బాధ్యతగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు పోగొట్టుకున్న పాపులారిటీని, ఎలా రీగెయిన్ చేసుకోవాలో చూసుకోవలసిన బాధ్యత కోద్ద మోడీ, షా జోడీ మీదనే ఉన్నది. అదలా ఉంటే, అధికార యావలో పడి బీజీపీ మూలాలను వదిలేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాలలోనే వుంది. పాపులారిటీ పడిపోవడానికి ఇదీ కూడా ఒక కారణమే అంటున్నారు.