థర్డ్ వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త
కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ చివరాఖరి దశకు చేరుకుంది. ఇక రేపో మాపో బై బై చెప్పి వెళ్ళిపోతుంది, ఆగష్టులో వస్తుందనుకున్న థర్డ్ వేవ్ రాలేదు. మనం ఇక కాస్త ఊపిరి తీసుకోవచ్చు, అని అందరూ ఆశపడుతున్న సమయంలో, కేంద్ర హోమ్ శాఖ బాంబు పేల్చింది. సెకండ్ వేవ్ ఉదృతి సంపూర్ణ క్షీణ దశకు చేరుకుంది, కానీ, మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చేసిందని, అక్టోబర్ నాటికీ, ఉదృత రూపం దాలుస్తుందని పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ, థర్డ్ వేవ్ వచ్చేసిందని, ప్రస్తుతానికి కొంత మెల్లగా ఉన్నా, అక్టోబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు తిరుగు లేని సంకేతమని,తేల్చి చెప్పింది. అలాగే, ‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే సంసిద్ధత.. పిల్లలపై ప్రభావం, రికవరీ’ పేరు’ తో ప్రధాని కార్యలయానికి సమర్పించిన అధ్యయన నివేదికలో ఎన్ఐఎండీ ముందుగా అనుకున్నట్టు చిన్న పిల్లల్లే థర్డ్ వేవ్ టార్గెట్’ కానుందని, అదే సమయంలో పెద్దలను వదలదని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ నష్టం తప్పదని గట్టి హెచ్చరికలే చేసినట్లు సమాచారం.
ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడితే వారికి తక్షణమే చికిత్స అందజేసేలా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు సహా పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలి’ అని తెలిపింది. అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు ప్రాధాన్యత, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. థర్డ్ వేవ్ అక్టోబరులో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలో వివిధ సంస్థలు వేసిన అంచనాలతో ఈ కమిటీ ఏకీభవించింది.ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో మరో 41 ఆసుపత్రుల్లో ప్లాంటుల ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భద్రాచలం, జగిత్యాల్, జనగాం అప్రభుత్వ ఆసుపత్రులలో PSA ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా సజావుగా కొనసాగుతోందని, రాష్త్రంలో మరో 13 లక్షల 18 వేల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందరికీ కొవిడ్ వాక్సిన్ వేసేందుకు అన్నీ ఏర్పాట్లూ జరుగుతున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. కిషన్ రెడ్డి, ప్రత్యక్షంగా థర్డ్ వేవ్ ప్రస్తావన చేయక పోయినా, కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్దం అవుతోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ ఫస్ట్ ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న శ్రద్ధ సెకండ్ వేవ్ సమయంలో తీసుకోలేదు. అందుకే, సెకండ్ వేవ్ కొవిడ్ కేసులే కాదు మరణాలు కూడా చాలా పెద్ద ఎత్తున సంభవించాయి. అయితే, ప్రభుత్వాతో పాటుగా, ప్రజలు కూడా నిర్లక్ష్యంగా నిబంధనలను గాలికి వదిలేశారు. అందుకే, ఫస్ట్ వేవ్ కన్నా.., సెకండ్ వేవ్’లో మన దేశం ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అలాగే, సెకండ్ వేవ్ ఉదృతికి డెల్టా వేరియంట్ కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన థర్డ్ వేవ్’ ఏ వేరియంట్’ అవుతుందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్డ్ వేవ్ రాక తప్పదని తేలడంతో.. పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని కమిటీ సైతం నివేదికలో పేర్కొనట్లు సమాచారం. మరో వంక కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు స్పష్టమైనసంకేతమని, దీనిని ఉపేక్షించ రాదని ఎన్ఐఎండీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.