దండోరా గర్జనలు.. రాహుల్ టూర్లు! కేసీఆర్ కు సినిమా చూపించబోతున్న రేవంత్..
posted on Aug 18, 2021 @ 2:22PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 70ఎం.ఎం త్రీడీ సినిమా చూపించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేసుకున్నారు. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లతో పాటు ఢిల్లీ లెవల్లో రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిర్విరామంగా ఉంచేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాను రూపొందించుకుంటున్న షెడ్యూల్స్ కు ఏఐసీసీ బాస్ రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షెడ్యూల్స్ కు ఫైనల్ టచప్ ఇచ్చే పనిలో రేవంత్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ షెడ్యూల్స్ తో, నాయకుల వరుస టూర్లతో అధికార టీఆర్ఎస్ తో పాటు, కేంద్రంలోని బీజేపీ నేతలకు కూడా ఏకకాలంలో సినిమా చూపించాలనేది రేవంత్ ప్లాన్.
2023లో రాష్ట్ర ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. రేవంత్ టీ-పీసీసీ చీఫ్ అయ్యాక రాష్ట్రంలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. హుజూరాబాద్ సభలో కేసీఆర్ స్వయంగా.. తన నోటి వెంట కేసీఆరో, పీసీఆరో ఎవరు గెలిచినా దళితబంధును కంటిన్యూ చేయాల్సిందే అంటూ తన గెలుపుపై తనే సందేహం వ్యక్తం చేయడం.. టీఆర్ఎస్ బాసులో నైరాశ్యాన్నే చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నట్లేనని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక భావనను మరింత వేగంగా పెంచేందుకు, అన్ని ప్రజాసమూహాల్లో బలంగా నాటేందుకు ఈ రెండేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ వ్యూహరచన చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకోసం దళితబంధు అస్త్రాన్నే రివర్సులో వాడుకోవాలని నిర్ణయించారు. అంటే అలాంటి పథకాన్నే అన్ని వర్గాలకు అందేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ఇందులో కీలకాంశం.
ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, రైతన్నలు, నేతన్నలు, నిరుద్యోగ యువకులు.. ఇలా అనేక వర్గాలకు దళితబంధు లాంటి ఫలాలే అందించాలనేది రేవంత్ ప్లాన్. ఆయా వర్గాలందరూ ఆత్మగౌరవంతో బతకతాలంటే ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు కచ్చితంగా అందించాలని ఆయన డిమాండ్ చేయబోతున్నారు. ఆత్మగౌరవ దండోరా పేరుతో తెలంగాణ అంతటా భారీ సభలు నిర్వహించి కేసీఆర్ పరిపాలనను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడమే ఇందులో ముఖ్యాంశం. ఆ సభలతో వాతావరణం వేడెక్కించేందుకు తెలంగాణలో ప్రతి 4 నుంచి 6 నెలల మధ్య ఒక్కో ఆత్మగౌరవ దండోరా ఉండేలా పక్కా ప్లాన్ వేస్తున్నారు రేవంత్. వచ్చే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేదాకా ఆత్మగౌరవ దండోరా యాత్రలు ఉంటాయని రేవంత్ వర్గీయులు కన్ఫామ్ చేస్తున్నారు.
ఒక్కో సామాజికవర్గం అధికంగా ఉన్నచోట ఆ వర్గాల డిమాండ్లకు ప్రాధాన్యం ఇస్తూ ఆత్మగౌరవ దండోరా ఉంటుందని, ఇలా దండోరా సభలు పూర్తయ్యాక అంతిమంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం మీద ఎన్నికల సమర శంఖం పూరించే అత్యంత భారీ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామంటున్నారు. ఆ సభతో కేసీఆర్ కుర్చీ కూలిపోవడం ఖాయమని, అందుకే ఇకనుంచి రేవంత్ షెడ్యూల్లో ఎక్కడా వ్యక్తిగత టూర్లు ఉండవని, కాంగ్రెస్ ను పవర్లోకి తీసుకొచ్చే దిశగానే రేవంత్ ప్రతీ ప్లానూ, టూరూ ఉంటాయంటున్నారు.
ఇక ఆత్మగౌరవ దండోరా సభలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకరకమైన సభలకు స్థానిక లీడర్లు హాజరైతే.. ఆ తరువాత జరిగే మరో సభకు స్వయంగా రాహుల్ గాంధీనే దింపాలని భావిస్తున్నారు. ఇలా ఆల్టర్నేట్ సభలకు రాహుల్ ను రప్పించడం ద్వారా స్థానిక నాయకుల్లో ఐక్యతతో పాటు పార్టీకి కట్టుబడి ఉండేలా చేయడం సులువవుతుందని, పార్టీ వాణిని ప్రజల్లోకి ఎపెక్టివ్ గా తీసుకుపోవచ్చని, పార్టీ నాయకుల కవరేజీ పెరిగి మీడియా ద్వారా భవిష్యత్ ఎజెండా ప్రజల మెదళ్లలో బ్రహ్మాండంగా రికార్డవుతుందని భావిస్తున్నారు. అలా జరిగినప్పుడే మీడియా వంటి పలు కీలకవర్గాలను తన అదుపులో ఉంచుకున్న కేసీఆర్ పాలనకు చరమగీితం పాడడం సులువవుతుందని రేవంత్ అనుచరవర్గం భావిస్తోంది. అయితే మొదటి సమావేశం మాత్రం సెప్టెంబర్ లోనే పెట్టాలని నిర్ణయించారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 17 కు తెలంగాణ విమోచన దినంతో పాటు, నరేంద్ర మోడీ జన్మదినం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ తేదీతో క్లాష్ రాకుండా ఇతర తేదీలను ఎంచుకొని కేసీఆర్ కు దిమ్మతిరిగేలా షాకివ్వాలని యోచిస్తున్నారు. ఇక సెప్టెంబర్ లో జరిగే తొలి ఆత్మగౌరవ దండోరా మాత్రం వరంగల్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓబీసీలు, నిరుద్యోగ యూత్, రైతన్నలు, నేతన్నలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలున్నారు కాబట్టి వారందరినీ కదిలించడంలో వరంగల్ సభ చక్కగా పనికొస్తుందని భావిస్తున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది.