పోస్కో పోయి టాటా వచ్చే?.. విశాఖ ఉక్కు రేసులో టాటా స్టీల్!
posted on Aug 18, 2021 @ 11:23AM
ఓవైపు ఉక్కు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకమూ అంతే జోరుగా జరుగుతోంది. ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇన్నాళ్లూ విశాఖ ఉక్కును పోస్కోకు కట్టబెడుతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా, దేశీయ కంపెనీ టాటా స్టీల్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆసక్తి కనబరుస్తోందని తెలుస్తోంది.
తాజాగా, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్--ఆర్‌ఐఎన్‌ఎల్‌ను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది. టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖ ఉక్కును గొప్ప కొనుగోలు అవకాశంగా టాటా స్టీల్ భావిస్తోంది.
విశాఖ ఉక్కు ప్రత్యేకతలెన్నో. దాదాపు 22,000 ఎకరాల భూమి. వార్షికోత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. దేశంలో తొలి తీరప్రాంత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. తూర్పుతోపాటు దక్షిణాది మార్కెట్లను అనుసంధానించే ప్రాంతంలో విశాఖ ఉక్కు ప్లాంట్ ఉండటం కీలకాంశం. తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వైజాగ్ స్టీల్‌ను దక్కించుకోగలిగితే టాటా స్టీల్‌కు ఆగ్నేయాసియా మార్కెట్లలో వ్యాపారం మరింత ఈజీ అవుతుంది.
దేశీయ మార్కెట్లోనూ రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్కును సరఫరా చేసేందుకు అవకాశం లభించనుంది. ప్లాంట్‌కు స్వల్ప దూరంలోనే గంగవరం పోర్టు ఉండటం వైజాగ్ స్టీల్‌కు మరో అనుకూల అంశం. గంగవరం పోర్టు నుంచి బొగ్గు తదితర ముడిసరుకుల దిగుమతి, స్టీల్ ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభమవుతుంది. అందుకే, విశాఖ ఉక్కు పరిశ్రమపై టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తోంది.
మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఇంత మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంటే అర్థం ఏంటి? కంపెనీ బాగుందనేగా? విశాఖ ఉక్కు లాభాలను తెచ్చిపెడుతుందనేగా? మరి, అంత మంచి కంపెనీని అడ్డగోలుగా అమ్మేసి.. ఎవరికో లాభం చేయడం ఎందుకు? ఆంధ్రుల హక్కును వారి నుంచి లాక్కోవడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలేవీ పట్టించుకోకుండా కేంద్రం మాత్రం తన మొండివైఖరితో ముందుకుపోతోంది.