సీఎం స్టాలిన్ స్టైలే వేరప్పా..
posted on Aug 18, 2021 @ 11:23AM
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పరిపాలనపై తనదైన ముద్ర వేసేందుకు, జనంలో మంచి మార్కులు కొట్టేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేశంలో, పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకునే ‘ధనిక’ రాష్టం తెలంగాణ సహా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా, పెట్రోల్, డీజిల్ లీటరు ధరను మూడు రూపాయలు తగ్గించి, జనం చేత జై కొట్టించుకున్నారు.ఇప్పుడు తాజాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, మంత్రులు, అధికారులకు భోజనపానాదులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్సులపై కోతపెట్టారు. ఉచిత భోజనాలకు స్వస్తి చెప్పారు.బహుమతులు, ఇతరత్రా దుబార ఆనుకున్న ఖర్చులు అన్నిటినీ కట్ చేశారు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శివాలయాన్ని తలపించే విధంగా మారింది. ఈకారణంగా బెల్టులు బిగించక, ఖర్చులకు తగ్గించుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు స్టాలిన్. అంతే ప్రత్యేక కేటాయింపుకు కట్ చేశారు. అఫ్కోర్స్’ ఒక్క తమిళనాడు ఆర్థిక పరిస్థితి మాత్రమే శివాలయం మిగిలిన రాష్ట్రాలలో వెంకన్న హుండీ కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలదీ అదే పరిస్థితి. పొరుగునున్న ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అయితే, అసలు చెప్పనే అక్కరలేదు. ఏ పూటకు, ఆపూట అప్పు పుడితేనే కానీ, రోజు గడవని పరిస్థితి. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలాస, వినోదాలకు కోత కాదు గాటు కూడా పెట్టింది లేదు. ఓ చేత్తో ఓటు కొనుగోలు పందారాలు, మరో వంక దుబారా ఖర్చులు వేటికవి యధేచ్చగా సాగిపోతున్నాయి. ఇక అవినీతి సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అదొక మహా గ్రంధం అవుతుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలా కాదు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో పొదుపుగా నిధుల్ని వాడుకోవాలని మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంతవరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్, గ్లాసుల మోత వరకు ప్రభుత్వ ఖజానా మీద ఆధారపడిన అమాత్యులు, అధికారులు అందరూ కూడా, జాగ్రత్త పడుతున్నారు. శాసన సభ సమావేశాల సమయంలో సహజంగా, ప్రతి మంత్రిత్వ శాఖకు, ఆహార పానీయాల కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తారు. ఆ నిధులతో స్టార్ హోటల్స్ నుంచి భోజనాలు వచ్చేవి. శాసన సభ సమావేశాల సమయంలో వెయ్యి మందికి పైగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగేది. అన్నీ, స్టార్ హోటళ్ల నుంచే వచ్చేవి. అలాగే, ఆయా శాఖల తరపున గిఫ్ట్‌లు సైతం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసంగా ప్రతి మంత్రిత్వ శాఖకు లక్షల్లో నిధుల కేటాయింపు జరిగేది, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇకపై అది ఎల్లా ముడియాద్, ఇక పై ఆ పప్పులు ఉడకవు, అని నిదులకు కోత పెట్టారు. దీంతో శాసన సభ సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు ఇంచక్కా ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారు. పండగ పూట కూడా పాత పెళ్ళామేనా అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఇంటి కూడేనా’ అని మంత్రులు, అధికారులు చాటుగా సణుక్కున్నా, జనం మాత్రం స్టాలిన్ కు మరోసారి జై కొడుతున్నారు.