ఎన్ని పథకాలు తెచ్చినా లాభం లేదా.. కేసీఆర్ ఆశలు వదిలేసుకుంటున్నారా?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవడమే, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందుకోసంగానే గడచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అందరినీ పరుగులు తీయిస్తునారు. ఆయన నిద్ర పోవడం లేదు, ఇంకొకరిని నిద్రపోనీయడం లేదు. నిజానికి, జనం తెరాసకు బ్రహ్మరధం పట్టేందుకు, ముఖ్యమంత్రి ఇంతగా ఆగం కావలసిన అవసరం లేదు. దూరం నుంచి పరిణామాలను గమనిస్తున్న వారికి ఒక్క దళిత బంధు పథకం చాలు, జనం చేత ముఖ్యమంత్రికి జై కొట్టించడానికి, హుజూరాబాద్ లో తెరాస అభ్యర్ధిని గెలిపించేందుకు, అనిపించవచ్చును. అయితే ముఖ్యమంత్రిలో మాత్రం ఆ విశ్వాసం లేదు,ఆ భరోసా కనిపించడం లేదని, పార్టీ నాయకులు కొందరు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.
రేషన్ కార్డుల మొదలు దళిత బంధు వరకు ప్రజలకు మేలుచేసే పథకాలను ఒక దాని వెంట ఒకటిగా పరుగులు పెట్టిస్తున్నా, ముఖ్యమంత్రికి హుజూరాబాద్ లో గెలుపు మీద విశ్వాసం ఏర్పడడం లేదు. ఓటమి భయం వదలడం లేదు. కుటుంబానికి పదిలక్షల రూపాయలు చేతిలోపెట్టే, ఉత్తమోత్తమ ఓట కొనుగులు పథకం దళిత బందు పథకం ప్రారంభ సమయంలోనూ ముఖ్యమంత్రి మాటల్లో భయంబేలతనమే వ్యక్తమయ్యాయని అంటున్నారు. అందుకే ముఖ్యమత్రి మాటల్లో ఇంత బేలతనమా? ఎప్పుడైనా చూశామా? ఎప్పుడైనా విన్నామా? అని తెరాస నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఉపన్యాసాని బట్టిచూస్తే, ముఖ్యమంత్రి ఓడిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లేనా, అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి భయానికి బలమైన కారణమే ఉంటుందని, లేదంటే, భయమన్నదే ఎరుగని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతలా ఎందుకు షేక్ అవుతారని తెలంగాణ భవన్ సాక్షిగానే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
నిజానికి దళిత బంధు పథకం ప్రారంభ వేదిక నుంచి చేసిన ఉపన్యాసంలోనే ముఖ్యమంత్రిని వెంటాడుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి భయం, బేలతనం బయట పడ్డాయని, ఇందుకు ప్రధాన కారణం, సర్వే ఫలితాలు అయితే, ఇంతవరకు ఎప్పుడు అంతగా పట్టించుకోని విశ్వసనీయత కోల్పోయిన వాస్తవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారని, అందుకే అంతగా ఆందోళన చెందుతున్నారని అంటునారు. ఈ నేపధ్యంలోనే, పార్టీ నాయకుడు ఒకరు, అసలు రహస్యాన్ని బయట పెట్టారు. “నిజానికి ముఖ్యమంత్రి భయానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై స్పష్టత రావడం ఒక్కటే, కాదు, మొత్తానికి పార్టీ భవిష్యత్ విషయంలోనే కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు” అని ఆయన అన్నారు.నిజమే కావచ్చును ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎంత పెద్ద వాగ్దానం చేసేందుకు అయినా, అయన ఒక్క క్షణం అలోచించరు. క్షణాల్లో చిటికెల పందిళ్ళు వేస్తారు.అంతే స్పీడ్’ గా అట్టు తిరగేస్తారు. ఓడ మల్లయ్యను బోడి మల్లయ్యను చేస్తారు. ఆ రకంగా ఆయన అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక సందర్భంలో, బుట్టలో వేసుకున్నారు. చేసిన వాగ్దానాలను ఇంచక్కా తుడిచేశారు.
దళితుల విషయంలో డోసు కొంచెం ఎక్కు వైంది. ఓ వంక ఇచ్చిన మాట ఏదీ నిలుపుకోలేదు, మరోవంక దళిత ఉప ముఖ్యమంత్రికి ఉద్వాసన పలకడం, వంటి అవమానాలకు గురి చేశారు. ముఖ్యమంత్రి పదవి మొదలు, కుటుంబానికి మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి అనేక వాగ్దనాలు చేసినా విషయాన్నీ కేసీఆర్ మరించి పోయారు. ఆ విధంగా దళితులే కాదు అందరి విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కోల్పోయారు. అంటే కాదు, దళితులను దగ్గరకు తీసుకుని చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేక పోతున్నామో చెప్పీ దళితలను విశ్వాసంలోకితీసుకునే ప్రయత్నం చేయలేదు, అందుకే అయన అందరి విశ్వాసాన్ని కోల్పోయారు. అదే ఇప్పుడు ఆయనను శాపమై వెంటాడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి భయం నిజంగానే భయం అయితే, అందుకు ఇంకా కారణాలున్నా, విశ్వసనీయత కోల్పోవడం ఒక ప్రధాన కారణమని విశ్లేషుకులు భావిస్తున్నారు.