సీబీఐ బోనులో మమతా దీదీ..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడితో ఎన్నికల యుద్ధం ముగిసింది. కానీ, ఆ వెంటనే రాజకీయ యుద్ధం మొదలైంది. అనూహ్యంగా అద్భుత విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల విజయం తెచ్చి పెట్టిన ఉత్సాహం, ఎన్నికల సందర్భంగా ఎదురైన చిన్నపాటి ఎదురు దెబ్బల తాలూకు అవమానాలను జతచేసి కత్తులు తీశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల పై యుద్దాన్ని ప్రకటించారు.తాలిబాన్ల తరహాలో దాడులకు తల పడ్డారు.
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో సాముహిక మానభంగానికి గురైన ఓ 17 ఏళ్ల బాలిక సహా ఇతర బాధితులు సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటీషన్ల ప్రకారం, అలాగే రాష్ట్ర హై కోర్టులోదాఖలైన అనేక పిటీషన్ల ప్రకారం గృహ దహనాలు, మానభంగాలు, బహిరంగంగా రాళ్ళతో కొట్టి, చెట్లకు కట్టి చంపడం వంటి భయంకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి, ఎన్నికల అనతరం హింస జరిగిందని, రాజకీయ హత్యలు జరిగాయని, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే ముందుగా అంగీకరించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆమె పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం తరపున నష్ట పరుహారం ప్రకటించారు. కానీ,ఎన్నికల అనంతర హింసపై సీబీఐవిచారణకే, కాదు అసలు ఎలాంటి విచారణకు అంగీకరించలేదు. అంతే కాదు, హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాలలో పర్యటించిన, బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించలేదు, , చివరకు గవర్నర్ పర్యటనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటనలను తృణమూల్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కమిషన్ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదులు అందాయి, అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హింస ఒక రొటీన్ వ్యవహారం అన్నట్లుగా మమతా బెనర్జీ, తేలిగ్గా తీసుకున్నారు.
చివరకు తృణమూల్ హింస రచన విషయం రాష్ట్ర హై కోర్టుకు చేరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన నేరాలు, ఘోరలపై సీబీఐ విచారణ జరిపించాలని, కోరుతూ దాఖలైన అనేక పిటీషన్లపై విచారణ జరిపిన కలకత్తా హై కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. ఇందులో, హత్యలు, మహిళలపై జరిగిన దాడులకు సంబదించిన ఆరోపణలఫై సీబీసి విచారణ జరిపించాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇతర కేసుల విచారణకు న్యాయ స్థానం పశ్చిమ బెంగాల్ క్యాడర్’కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో, ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసింది. గతంలో, హై కోర్ట్ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతర హింసపై విచారణ జరిపిన జాతీయ మానవహక్కుల సంఘం, సీబీఐ విచారణ సిఫార్సు చేస్తూ జూలై 13న, న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు గురువారం తీర్పు నిచ్చింది.
ఇక అసలు విషయంలోకి వస్తే, రాష్టంలో హింస జరగడం ఒకెత్తు, అయితే, తీర్పులో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల అనంతర చెలరేగిన హింస విషయంలో, అసలు విచారణే అవసరం లేదన్నట్లుగా వ్యహరించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చెంప పెట్టులా ఉన్నాయని రాజాకీయ పరిశీలకులు భావిస్తున్నారు. న్యాయమూర్తులు, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ ఐపీ ముఖర్జీ, జస్టిస్ హరీష్ టాండన్, జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ సుబ్రతా తలుక్దార్ టం తీర్పులో, “ హత్య, మానభంగం వంటి హేయమైన నేరాలపై, స్వతంత్ర నేర పరిశోధన సంస్థ, ప్రస్తుత పరిస్థితులలో సీబీఐ, విచారణ అవసరం..అనేక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో కూడా విఫలమైంది. ఇది, విచారణను పక్కదోవ పట్టించే ముందస్తు ప్రణాళికను తెలియచేస్తుంది” అని పేర్కొంది. అందుకే అంతిమ తీర్పు ఎలా ఉన్నప్పటికీ, హై కోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మింగుడు పడక పోవచ్చును. ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉంది. ఇంతవరకు అయితే ఆమె హై కోర్టు ఆదేశాలపై మౌనంగానే ఉన్నారు. ఇక ముందు ఎలా స్పందిస్తారు,విచారణ ఏ మలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.