తాలిబన్ల తరహాలో ఏపీ వైసీపీ నేతలు!
posted on Aug 18, 2021 @ 3:17PM
గుంటూరులో పట్టపగలు నడిరోడ్డులో దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేతలు కేసు పెట్టడం తీవ్ర విమర్శల పాలవుతోంది. బాధిత దళిత కుటుంబానికి న్యాయం చేయలేకపోయిన ప్రభుత్వం.. వాళ్లకు బాసటగా నిలిచిన వారిని టార్గెట్ చేయడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. ఆప్ఙనీస్తాన్ లోని తాలిబన్‌ల మాదిరిగా వైసీపీ నేతలు ఏపీలో పని చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. లోకేష్ పై ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అట్రాసిటీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అట్రాసిటీ చట్టం ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. గాలివాటంగా వచ్చిన నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు.
తాము కూడా అధికారంలో ఉన్నామని...ఏ రోజు పోలీసు సిబ్బందితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయించలేదని నక్కా ఆనంద్ బాబు అన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పరామర్శిస్తుంటే వైసీపీ నేతలను పోలీసుల ఎలా తీసుకువస్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్ద మార్కులు కోసం పోలీసులు పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పేకాట , గుట్కా, మద్యం విచ్చలవిడిగా సాగుతుందని తెలిపారు. జిల్లా పోలీసుల అధికారుల అవినీతిలో కూరుకపోయారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిభిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసులకు సిగ్గు చేటన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని...ఈ పోలీసు అధికారులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని నక్కా ఆనంద బాబు హెచ్చరించారు.
రమ్య మృతదేహానికి నివాళి అర్పించటానికి లోకేష్ వెళ్ళిన సమయంలో వైసీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారని మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. పరామర్శించటానికి వెళ్ళినందుకు వైసీపీ రాజకీయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్‌లు చూస్తే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిందో అర్థమవుతుందన్నారు. తమ మీద ఆరోపించిన విషయాల్లో పొంతన లేకుండా పోయిందని తెలిపారు. రక్షక యంత్రాంగం భక్షక యంత్రాంగంగా మారిపోయిందని విమర్శించారు. పోలీసులలో కొంత మంది ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు జీజీహెచ్ వద్ద లేరా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రమ్య హత్య పోలీసు వైఫల్యం కాదా అని నిలదీశారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాపపు మాటలు మాట్లాడారని... ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతోందని ఆలపాటి రాజా అన్నారు.
దళిత విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన నారా లోకేష్, టీడీపీ నేతలను వైసీపీ రౌడీమూకలు ఎందుకు అడ్డుకున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు.మృతురాలి కుటుంబసభ్యులతో లోకేష్ మాట్లాడకుండా, వారిని డీఎస్పీ ఎందుకు తన కారులో తీసుకెళ్లారని మాణిక్యరావు నిలదీశారు. లోకేష్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తడుపుకుంటున్నారన్నారు. లోకేష్‌ను ఆపడం వైసీపీ రౌడీమూకలు, పోలీసులు వల్లకాదన్నారు. దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.