లోకేష్ దూకుడుతో జగన్ కు చుక్కలు! ఇక ఆగేదే లేదంటున్న తమ్ముళ్లు..
posted on Aug 17, 2021 @ 8:16PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రతిపక్ష టీడీపీలో జోష్ కనిపిస్తుండగా.. అధికార వైసీపీలో మాత్రం కంగారు పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దూకుడుతో ఫ్యాన్ పార్టీ పరేషాన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ ఘటనలపై వేగంగా స్పందిస్తున్నారు నారా లోకేష్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళుతూ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. లోకేష్ వరుస పర్యటనలతో ప్రభుత్వంలో వణుకు కనిపిస్తోంది.
గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు నారా లోకేష్. గుంటూరులో రోజంతా రచ్చ జరిగింది. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధీటుగా నిలబడ్డారు లోకేష్. గంటల పాటు పోలీస్ స్టేషన్లు తిప్పినా ఏమాత్రం జంకలేదు. గుంటూరులో లోకేష్ తీరుతో టీడీపీ నేతల్లోనూ జోష్ కనిపించింది. రాత్రి తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన లోకేష్.. మంగళవారం కర్నూల్ వెళ్లారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం మొత్తం జై టీడీపీ, జై లోకేశ్ నినిదాలతో హోరెత్తిపోయింది. లోకేశ్ ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహాన్నే తలపించింది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన హజిరబీపై 2020 ఆగస్టు 17న హత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హజిరబీపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటనపై నాడే కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటిదాకా నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చలేదు. అసలు ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో కూడా తెలియదు. ఈ ఘటనపై తనదైన శైలిలో సమాచార సేకరణ చేసిన లోకేశ్.. ఈ ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తి అయిన సందర్భంగా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఎర్రబాడు వెళ్లారు, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హజిరబీపై నాడు జరిగిన దాష్టీకంపై మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన భరోసాపై ఆరా తీశారు. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉంది? అసలు పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారా? లేదా? అని కూడా లోకేశ్ ఆరా తీశారు. అనంతరం జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగిన లోకేశ్.. హజిరబీపై హత్యాచారం జరిగి మంగళవారం నాటికి సరిగ్గా ఏడాది దాటిందని గుర్తు చేశారు. దిశ చట్టంతో 21 రోజుల్లోనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు కదా.. మరి హజిరబీ కేసులో ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకుంటున్న జగన్ సర్కారును.. ఈ పర్యటనతో లోకేశ్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు.
సోమవారం నాడు బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి నివాళి అర్పించడంతో పాటుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలతో కలిసి లోకేశ్ గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ ను ఎక్కడికక్కడ అడ్డుకునేలా వైసీపీ శ్రేణులు, పోలీసులు యత్నించాయి. కర్నూలు జిల్లా పర్యటనలోనూ లోకేశ్ ను అడ్డగించే యత్నాలే జరిగాయి. కర్నూలు నుంచి ఎర్రబాడు బయలుదేరిన లోకేశ్ కాన్వాయ్ పై దాడికి ప్లాన్ వేసిన వైసీపీ శ్రేణులు.. ఆయన వెళ్లే మార్గంలోనే ఇతర కార్యక్రమాల పేరు చెప్పి ఎంట్రీ ఇచ్చారు. అయితే గుంటూరులో చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇటుగా వచ్చేందుకు అనుమతించేది లేదని వైసీపీ శ్రేణులకు చెప్పిన పోలీసులు.. కనీసం వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. అంటే.. ముందస్తు వ్యూహం మేరకే అక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకుంటే.. పోలీసులు కూడా ఓ డ్రామాను తలపించేలా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై ఇప్పటికే ఓ స్పష్టమైన అవగాహనతోనే ఉన్న లోకేశ్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కు తగ్గేది లేదన్న దిశగా కదిలిన వైనం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నారా లోకేశ్ టూర్లతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంటే.. అధికార వైసీపీలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోందని తెలుస్తోంది.