పీవీ సింధు సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
posted on Aug 17, 2021 @ 7:47PM
క్రమం తప్పకుండా ప్రతినిత్యం ధ్యానం చేసుకోవడమే తన సక్సెస్ సీక్రెట్ అంటూ రెండుసార్లు వరుస ఒలింపిక్ విజేతగా నిలిచిన పీవీ సింధు పేర్కొంది. సింధు నోటినుంచి ధ్యానం గురించి రావడంతో ఔత్సాహికుల్లో, ముఖ్యంగా కెరీర్ డెవలప్ కోసం ఆవురావురంటున్న కుర్రకారు దీని గురించి మరింత ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్... తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి బాహాటంగా చెప్పడం విశేషం. తాను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాతే జీవితం మొత్తం మారిపోయిందని, అనుకోని మార్పులు సంభవించాయని పేర్కొంది. ధ్యానం చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో తాను స్వయంగా ఫీలవుతున్నానని, జీవితంలో ఎదగాలనుకునేవారు, పెద్ద లక్ష్యాలతో పని చేసేవారు తప్పకుండా రోజూ ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు సమకూరతాయని చెబుతోంది. ధ్యానం వల్ల స్ట్రెస్ తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని, అందువల్ల లక్ష్యాలు ఛేదించడం సులువవుతుందంటోంది. ధ్యానం చేసిన ఎవరైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా అధిగమించగవరని ఘంటాపథంగా చెబుతోంది సింధు.
తన కుటుంబంలో తానొక్కతే ధ్యానం చేయదని, తామంతా కలిసే ధ్యానం చేస్తామని మరో ఆసక్తికరమైన విషయం రివీల్ చేసింది సింధు. తల్లిదండ్రులతో కలిసి చేస్తే అది మరింత ఫలవంతమవుతుందంటూ నేటి పేరెంట్స్ లో కూడా పరోక్షంగా అవగాహన కలిగిస్తోంది సింధు.
ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిసిన భారతీయ తెలుగు సింధూరం తాజాగా హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించుకుంది. 130 కోట్ల భారత ప్రజల ఆశీర్వాదంతో, అమ్మవారి దయతో తాను పతకం గెలుచుకున్నానని అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ చంద్రప్రకాశ్ పి.వి.సింధును అమ్మవారి సమక్షంలో సన్మానించారు.