పంజరంలో రామ చిలుకలా సీబీఐ.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
posted on Aug 18, 2021 @ 1:01PM
మనదేశంలో జాతీయ స్థాయిలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ). ఎన్నో కఠినమైన కేసులను చేధించిన చరిత్ర సీబీఐకి ఉంది. అయితే కొంత కాలంగా సీబీఐపై ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ఎవరూ అధికారంలో ఉంటే.. వాళ్లకు సీబీఐ కీలుబొమ్మలా మారుతుందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. యూపీఏ హయాంలో ఉండగా... సీబీఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉండగా... సీబీఐని బీజేపీ తొత్తుగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. సీబీఐ కేసుల విషయంలోనూ ఈ ఆరోపణలు బలపడేలా ఉంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలే ఎక్కువగా సీబీఐకి టార్గెట్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేతలపై ఒకలా, ఇతరుల విషయంలో మరోలా సీబీఐ వ్యవహరిస్తుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
తాజాగా సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంజరంలో రామచిలుకలా సీబీఐ మారిపోయిందని, వెంటనే దానిని విడుదల చేయాలని ఆదేశించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్ కే రిపోర్ట్ చేయాలని సూచించింది.తమిళనాడులో జరిగిన 'పోంజీ' స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది మద్రాస్ హైకోర్టు. సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని చేయాలి. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్ కు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కామ్ కేసును బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సంస్థలో వెంటనే కేడర్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్ బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది మద్రాస్ హైకోర్టు.