తాలిబన్ల పాలనంటే ఎందుకంత భయం? ఎలాంటి రూల్స్, శిక్షలు ఉంటాయి?
posted on Aug 18, 2021 @ 1:41PM
తాలిబన్ల రాజ్యమంటే అఫ్ఘన్‌లు భయంతో వణికిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ విమానాల రెక్కలు పట్టుకొని వేలాడుతున్నారు. కుటుంబాన్ని, మహిళలను, పిల్లలను వదిలేసి.. దేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో గత చేదు అనుభవాలు, కఠిన శిక్షలు ఇప్పటికీ వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ భయానక పరిస్థితులు మళ్లీ వచ్చాయంటూ.. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో బతకలేమంటూ.. విదేశాలకు ఎగిరిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ఘన్ ప్రజల కళ్లల్లో తాలిబన్లంటే భయం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆ పేరెత్తితేనే శరీరం నిలువునా వణికిపోతోంది. మరి, వారి నిబంధనలు అలా ఉంటాయి.. వారి విధించే శిక్షలు అంత క్రూరంగా ఉంటాయి.. ఇంతకీ తాలిబన్ల రూల్స్ ఏంటి? పనిష్మెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయి?
తాలిబన్లు వారి సొంతంగా ఎలాంటి నిబంధనలను, శిక్షలను సృష్టించలేదు. జస్ట్ వారు షరియా చట్టాలు అమలు చేస్తారంతే. షరియా చట్టం ఏం చెబితే అదే వారి పాలన. వాటిని తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశిస్తారు. అలా చేయకపోతే.. షరియా చట్టంలో ఉన్న ప్రకారమే కఠినాతికఠినంగా శిక్షిస్తారు. అందుకే, తాలిబన్ల కంటే షరియా చట్టాలే మరింత ఖతర్నాక్ అని అంటారు. కాబట్టే, తాలిబన్లు అధికారంలోకి వస్తే షరియా చట్టాలను అమలు చేస్తారని అప్ఘన్ ప్రజలు ఇంతలా భయపడుతున్నారు.
షరియా.. అరబిక్ పదం. దాని అర్థం మార్గం. షరియా న్యాయపరమైన హద్దులు గల మార్గం. సామాజిక వ్యక్తిగత జీవితాలను ఇది నిర్ధేశిస్తుంది. తప్పు చేసిన వారికి షరియా చట్టం ప్రకారం శిక్షించాలంటుంది. ఆ మార్గదర్శకాలే మహా క్రూరంగా ఉంటాయి కాబట్టే షరియా చట్టాలన్నా, తాలిబన్లన్నా ఇంతటి భయాందోళన.
హత్య చేసిన వారిని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని.. స్త్రీ, పురుష బేధం లేకుండా బహిరంగంగా తలలు నరకడం కానీ, ఉరితీయడం కానీ చేస్తారు. దొంగతనాలకు పాల్పడితే కాళ్లు చేతులు నరికేస్తారు. అందుకే, తాలిబన్ల రాజ్యంలో నేరం చేయాలనే ఆలోచన వచ్చినా భయంతో చెమటలు పట్టాల్సిందే.
షరియా చట్టాల ప్రకారం మగవారికి గడ్డాలు తప్పనిసరి. పదేళ్లు పైబడిన బాలికలు బడులకు వెళ్లకూడదు. సంగీతం, టీవీ, సినిమాలూ నిషేధం. మహిళలు బయటకు వెళ్లాలంటే తోడుగా మగవారు ఉండాలి. అతడు భర్త, తండ్రి, సోదరుడు, కుమారుడు లాంటి రక్తసంబంధీకుడై ఉండాలి. మహిళలు హైహీల్స్ వేసుకోకూడదు. కాలి నుంచి చేతి వరకు శరీరంలోని ఏ భాగం కనిపించకుండా బురఖా వేసుకోవాలి. తాజాగా, తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడానికి వస్తుండగా వారికి టైట్ డ్రెస్ వేసుకున్న మహిళ కనిపించిందట. వెంటనే తల్వార్‌తో నడిరోడ్డు మీద ఆమె తల నరికేశారని అంటున్నారు. తాలిబన్లు ఇంత క్రూరంగా ఉంటారు కాబట్టే.. వారంటే అంత భయం.
మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు. బహిరంగ ప్రదేశంలో పెద్దగా మాట్లాడకూడదు. ఎనిమిదేళ్ల వయసు వచ్చాక బాలికలు చదవడానికి వీళ్లేదు. మహిళలు ఇంటి బాల్కానీలో నిలబడటం నిషేధం. ఇంటి కిటీకీలోంచి కూడా బయటకు చూడకూడదు. వీడియోలు, సినిమాల్లో నటించకూడదు. రేడియో, టీవీలలో పనిచేయకూడదు.సైకిల్ మోటార్ సైకిల్ నడుపకూడదు. మహిళలు బస్సుల్లో ప్రయాణించకూడదు. వారికోసం ప్రత్యేక మహిళా బస్సులు ఉంటాయి. మహిళలు బహిరంగ సమావేశాల్లో పాల్గొనకూడదు. చివరాఖరికి భర్త సైతం తన భార్య ఫొటోను ఫోన్‌లో ఉంచుకోకూడదు. తాజాగా, తాలిబన్లు కాబూల్‌లోని ఓ బ్యూటీపార్లర్ గోడలపై ఉన్న మహిళల బొమ్మలకు రంగులు వేసి మూసేయడం తెలిసిందే. మొత్తం మీద తాలిబన్ల పాలన.. మగవారికంటే మహిళలపైనే ఎక్కువ ఆంక్షలు.
అయితే, ఇవన్నీ గత తాలిబన్ల విధానాలు. ఈ 20 ఏళ్లలో వారిలోనూ ఎంతోకొంత మార్పు వచ్చినట్టుంది. తాము మహిళలకు వ్యతిరేకం కాదనే మెసేజ్‌ను ఇప్పటికే తాలిబన్లు ఇచ్చారు. ప్రభుత్వంలో మహిళలకు చోటు కల్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. లేటెస్ట్‌గా, తాలిబన్ల నాయకుడు ఓ మహిళా న్యూస్ యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలన విషయమే. తాలిబన్ల నుంచి ఇలాంటి మార్పును ఎవరూ ఊహించి ఉండరు. ఉద్యోగాల్లోనూ మహిళలకు అనుమతి ఇస్తామంటున్నారు. ప్రజావ్యతిరేకత నుంచి కాచుకొని.. తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి కాబోలు.. తాలిబన్లలో ఇలాంటి చిన్నచిన్న మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయినా, వారిని నమ్మలేమని.. గత చేదు అనుభవాల దృష్ట్యా.. తాలిబన్ల పాలన అంటే భయమే కానీ, ఏ ఒక్క అఫ్ఘనిస్తానీలో కూడా వారిని స్వాగతించడం లేదు.