జగన్ పాలనపై 6 శాతం ప్రజలే హ్యాపీ.. ఇండియా టుడే సర్వేతో షేకవుతున్న వైసీపీ
posted on Aug 17, 2021 @ 6:41PM
పాయే.. సీఎం జగన్ పరువంతా పాయే. ఇప్పటికే ఏపీలో ఆయన ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. ఇండియా టుడే సర్వేతో ఆ విషయం ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది. టాప్ నుంచి జర్రుమంటూ జారుడు బల్లలా కిందికిందికి జారిపోతున్నారు జగన్. మొదటి ఏడాది ఇదే ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో సీఎం జగన్ టాప్ 2లో ఉండేవారు. ఆ తర్వాత టాప్ 3కి పడిపోయారు. ఇప్పుడే ఏకంగా 11 స్థానానికి పతనమయ్యారు. సీఎం జగన్‌పై ప్రజాభిమానం ఈ రేంజ్‌లో వైకుంఠపాళిలా అథఃపాతాళానికి పడిపోవడం వైసీపీ వర్గాలకు మింగుడు పడకపోవచ్చు కానీ.. ఇది ప్రజానాడిని, జగన్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను సుస్పష్టం చేసిన సర్వే సత్యం.
జగన్ బెస్ట్ సీఎం పట్టుమని 10శాతం మంది కూడా భావించడంలేదంటే జగన్ పరిపాలనపై ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుస్తోంది కేవలం 6 అంటే 6 శాతం మాత్రమే జగన్ మంచి సీఎం అన్నారు. అంటే, మిగతా 94శాతం మంది జగన్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టేగా? జగన్ సీఎంగా అనర్హుడని తేల్చేసినట్టేగా? గతేడాది ఇది 11శాతంగా ఉండగా.. ఈసారి 6శాతానికి పడిపోవడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శణం అంటున్నారు. ముఖ్యమంత్రుల రేటింగ్‌ను ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అభిప్రాయాలతోనే ఇవ్వడం విశేషం.
ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ దేశంలో అందరి కంటే ముందున్నారు. ఆయన అత్యుత్తమ పాలన అందిస్తున్నారని 42 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఉద్దవ్ ధాకరే, మమతా బెనర్జీ ఉన్నారు. వీరంతా 30 శాతానికిపైగా అప్రూవల్ రేటింగ్ తెచ్చుకున్నారు. 30 నుంచి 19 శాతం మధ్య రేటింగ్ తెచ్చుకున్న వారిలో అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ సీఎంలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎక్కడో వెనకబడి ఉన్నారు. సీఎం జగన్‌ను కేవలం 6 శాతం ప్రజలే బెస్ట్ సీఎంగా ఆమోదించడం.. జాబితాలో 11వ స్థానానికి పడిపోవడం.. ముఖ్యమంత్రి జగన్ అరాచక, అడ్డగోలు పాలనకు నిజమైన నిదర్శనం అంటున్నారు.
ఏ రకమైన ఎలక్షన్లు వచ్చినా వైసీపీ గెలుస్తోందిగా? అనే అనుమానం రావొచ్చు. ఎన్నికలు వేరు, సర్వేలు వేరు. ఎలక్షన్లపై తాయిలాలు, భయాలు, బెదిరింపులు, కులాలు, మతాలు, వర్గాలు, కుట్రలు, కుతంత్రాలు, దొంగ ఓట్లు ప్రభావం చూపిస్తుంటాయి. జన్యూన్‌గా జరిగే ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేషన్ లాంటి సర్వేల్లో అసలైన ప్రజాభిప్రాయం స్పష్టమవుతోంది. అందుకే, ఈ ఫలితాలకు దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంటుంది. సర్వేను చాలా ప్రామాణికంగా చేస్తారు. రిజల్ట్స్ కూడా అంతే శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. అందుకే ఇండియా టుడే సర్వేలో సీఎం జగన్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందంటే అర్థం.. ప్రజలు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి, అసహకనంతో ఉన్నట్టే. ఇందులో నో డౌట్. పప్పు-బెల్లాలు పంచుతున్నాంగా.. జనం మా వెంటే ఉంటారనే అపనమ్మకాన్ని పటాపంచలు చేసిందీ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్.
గతంలో టాప్ ర్యాంకుల్లో ఉన్నప్పుడు ఇండియా టుడే ఫలితాలను గొప్పగా ప్రచారం చేసుకుంది జగన్ మీడియా. ఇప్పుడు అదే సర్వేలో జగన్ పొజిషన్ 11 స్థానానికి పడిపోవడాన్ని.. 6 శాతం మాత్రమే జగన్‌ను బెస్ట్ సీఎం అనడాన్ని ఎలా వ్యాఖ్యానిస్తుందో చూడాలి. ఇండియా టుడేను సైతం ఎల్లో మీడియా అని బురద అంటించడానికి లేదు. అది ఈ రాష్ట్ర వార్తా సంస్థ కూడా కాదు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న, నిఖార్సైన, నిబద్దత కలిగిన మీడియా హౌజ్. అందుకే, తాజా సర్వే.. సీఎం జగన్‌కు మంచి గుణపాఠమే అంటున్నారు. ఏళ్ల తరబడి సీఎంలుగా ఉంటున్న మమతా బెనర్జీ, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్ వంటి వారిపై ప్రజాధరణ అలానే కొనసాగుతుండగా.. రెండేళ్లలోనే జగన్ నిజ స్వరూపం ప్రజలకు బాగా తెలిసొచ్చేసింది. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారనే విషయం జనాలకు తెలీదనుకుంటే పొరబాటే. రెండేళ్లలో ఏపీకి ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. ఉన్న కంపెనీలే రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేస్తున్న వైనాన్ని ప్రజలు కనిపెడుతూనే ఉన్నారు. కులాల ముద్ర వేసి.. ప్రజలను విభజించి పాలించడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధించడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుస్తోంది. మద్యపానం నిషేధమని హామీ ఇచ్చి.. అడ్డగోలు బ్రాండ్లు తీసుకొచ్చి.. ధరలు పెంచి అడ్డంగా దోచుకోవడం.. ఇసుక నుంచి ఖనిజాల వరకూ సహజ వనరులన్నిటినీ తవ్వేసుకోవడం.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్‌తో ఆటాడుకోవడాన్ని ప్రజలు ఏమాత్రం ఆమోదించడం లేదని ఇండియా టుడే సర్వేతో తేలిపోయింది. అందుకే, ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ వేగంగా, దారుణంగా పడిపోయిందని అంటున్నారు.