భారత్‌పై అఫ్ఘనిస్తాన్ ఎఫెక్ట్.. వీటి ధరలు పెరగొచ్చు..
posted on Aug 18, 2021 @ 5:50PM
అఫ్ఘనిస్తాన్. పేరుకు మామూలు దేశమే అయినా.. దానికీ కొన్ని విషయాల్లో డిమాండ్ ఉంది. దేశాల మధ్య వ్యాపారం పెరిగిన నేపథ్యంలో.. ఒక దగ్గర నాణ్యమైన సరుకు ఉందంటే.. యావత్ ప్రపంచం అక్కడ వాలిపోతుంది. అఫ్ఘన్ సైతం అనేక దేశాలతో పలు రకాల బిజినెస్ చేస్తోంది. ఇండియా కూడా పొరుగు దేశం నుంచి పలు వస్తువులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. మరికొన్ని దిగుమతులకు తన భూభాగాన్ని అనుమతిస్తూ భారత్‌కు సహకరిస్తోంది అఫ్ఘనిస్తాన్.
తాజాగా, అఫ్ఘన్ తాలిబన్ల వశం కావడంతో ఇండియాపై పలురకాలుగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం పడనుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయం పక్కనపెడితే.. పలు వ్యాపార అంశాల్లో భారత్‌పై ఎఫెక్ట్ పడొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్- CAIT అంటోంది. ఇండియా - అఫ్ఘనిస్తాన్ మధ్య 2020-21లో 1.4 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అఫ్ఘన్ నుంచి దిగుమతులతో పాటు.. మన దగ్గరి నుంచి పలు వస్తువులు ఆ దేశానికి ఎగుమతి కూడా అవుతుంటాయి.
కాబూలీ చెన.. వినే ఉంటారుగా. పెద్ద సైజులో, తెల్లగా ఉండే శనగలు. పేరులోనే ఉందిగా కాబూలీ అని. ఆ రకం శనగలకు అఫ్ఘనిస్తాన్ ప్రధాన కేంద్రం. ఇప్పుడు ఆ శనగల దిగుమతిపై ప్రభావం తప్పకుండా పడుతుంది. ఆ మేరకు ధర పెరుగుతుంది. శనగలనే కాదు.. పలు రకాల డ్రైఫ్రూట్స్‌కు ఆ దేశం ఫుల్ ఫేమస్. ఎండు ద్రాక్ష, వాల్‌నట్, బాదం, పిస్తా, ఎండిన ఆప్రికాట్, అత్తి, పైన్ గింజలు, పుచ్చకాయ, చెర్రీస్, నేరేడు పండ్లు, పలురకాల ఔషధ మూలికలు అఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు భారీగా దిగుమతి అవుతుంటాయి. తాజా సంక్షోభం కారణంగా దిగుమతి పరిమాణం తగ్గి.. వీటి ధరలు పెరగవచ్చు. ప్రజలపై మరింత భారం పడొచ్చు.