తాలిబాన్లు మహిళల పట్ల సాఫ్ట్ గా మారుతున్నారా?
posted on Aug 17, 2021 @ 7:47PM
తాలిబాన్ల గురించి ప్రపంచమంతా చాలా చెడ్డగా చెప్పుకుంటున్న క్రమంలో తాజాగా తాలిబాన్ల నుంచి ఓ ఆసక్తికరమైన ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ గురించి తెలుసుకుంటే తాలిబాన్లు మహిళల పట్ల సాఫ్ట్ గా మారారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదేంటంటే.. మహిళల పట్ల తాము మానవీయంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలాల్లో మహిళలు చేరిపోవాలని తాజాగా తాలిబాన్ల కల్చరల్ కమిషన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. తాలిబాన్ల సాంస్కృతికి విభాగానికి చెందిన సీనియర్ మెంబర్ ఇనాముల్లా సమంగా ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
తాలిబాన్లు కాబూల్ ను హస్తగతం చేసుకోవడంతో ప్రజలంతా వేర్వేరు దేశాలకు పారిపోవడానికి పోటీ పడ్డారు. విమానంలో కూడా సందులేకుండా, దాని టైర్లకు, రెక్కలకు వేళ్లాడుతూ బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి ప్రజలు పారిపోయారు. విమానం టేకాప్ తీసుకున్న తరువాత ఆకాశం నుంచి పలువురు రాలి పడిపోవడం అంతర్జాతీయ మాధ్యమాల్లో ఆఫ్ఘన్ ప్రతిష్టను దిగజార్చింది. దాంతోబాటే తాలిబాన్ల పైశాచికం గురించి ప్రపంచమంతా మరోసారి కోడై కూసింది. గతంలో వారు తుపాకీ నీడన ఏం చేశారో అంతా గుర్తు చేసుకుంటున్నారు. అటు మహిళల బొమ్మలు గానీ, వారి సాధికారతను తెలిపే సైన్ బోర్డులు, హోర్డింగులను తొలగిస్తూ పూర్తిగా షరియా-లా ను అమలు చేస్తున్నారు. దీంతో ఆఫ్ఘన్ ప్రజలంతా వారి ఇళ్లకే పరిమితమై తాలిబాన్ల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ అవుతాయో.. పరిపాలనను ఎలా పట్టాలకెక్కిస్తారో అంటూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇనాముల్లా ప్రకటన ఆసక్తి రేపుతోంది.
తమ దేశంలో ఉండేవారంతా ముస్లింలేనని, అందుకని ప్రత్యేకించి తాము కొత్త చట్టాలేవీ ప్రవేశపెట్టబోవడం లేదని, మహిళల పట్ల కూడా షరియా ప్రకారమే ప్రవర్తిస్తామని పేర్కొన్నాడు. ఈ దేశ మహిళలు ప్రభుత్వ పాలనలో భాగం పంచుకోవాలని, అయితే వారి సేవలు, విధి నిర్వహణ అన్నీ కూడా షరియా చట్టాన్ని అనుసరించే ఉంటాయని స్పష్టతనిచ్చారు.
తాలిబాన్ల వైఖరి ఎలా ఉంటుందో ఇప్పటికే తెలిసిన ప్రపంచ దేశాలు తాజాగా ఆఫ్ఘన్ కు ఆర్థిక సాయం నిలిపివేశాయి. తాలిబాన్లను గుర్తించడం లేదని డబ్ల్యు.హెచ్.వో ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. అమెరికా ఆంక్షలు విధించగా.. యూకే కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతోంది. ఆయా దేశాల నిర్ణయాలు అమల్లోకి వస్తే ఆఫ్ఘన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. అదే జరిగితే తాలిబాన్లకు కూడా దినదిన గండంగా మారే పరిస్థితులు ఎదురుకాక తప్పదు. దాని పర్యవసానాలు ఊహించే మహిళల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ వ్యక్తం చేస్తూ తాజా ప్రకటన వచ్చిందని, అంతే తప్ప మహిళలతో వారి వ్యవహారం ఎప్పుడూ మారేది కాదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వారి ప్రకటనలోనే మహిళలు షరియా లా ప్రకారం అన్న షరతు విధించడాన్ని గమనించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.