ద్యావుడా..? తాలిబన్లు సమరయోధులట! ఎస్పీ ఎంపీపై దేశ ద్రోహం కేసు..
posted on Aug 18, 2021 @ 5:14PM
పరిస్థితులు మారిపోతున్నాయి. అనూహ్యమైన, అవాంఛనీయమైన రాజకీయ వ్యాఖ్యానాలు కలకలం రేపుతున్నాయి. తాలిబాన్ల గురించి ప్రపంచమంతా కలవరపడుతుంటే.. భారత్ లోని కొందరు నాయకులు, కొన్ని పార్టీలు మాత్రం తాలిబాన్లకు తాబేదార్లుగా మారుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), సంభల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ షఫీక్-ఉర్-రెహమాన్ బర్క్ తాలిబాన్లను మన దేశ స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చి సలాం కొడితే.. ఆ తరువాత కొన్ని గంటల తేడాతోనే ఓ భారతీయ ఇస్లామిక్ పండితుడు అదే రాగం అందుకోవడం కలకలం రేపుతోంది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజ్జాద్ నోమానీ వివాదాస్పద కామెంట్లు చేశారు. షఫీక్ రహమాన్ చేసిన కామెంట్లను జాగ్రత్తగా పరిశీలించిన స్థానిక పోలీసులు ఆయన మీద ఐపీసీ సెక్షన్ 124 A ప్రకారం రాజద్రోహం కింద కేసు బుక్ చేశారు. అలాగే ప్రజల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యానాలు చేసినందుకు, ప్రవర్తించినందుకు 153A, 295 కింద కూడా సంభల్ ఎంపీ మీద ఎఫ్.ఐ.ఆర్. బుక్ అయింది. బ్రిటిష్ పరిపాలనలో భారత్ ఉన్నప్పుడు భారతీయులు స్వాతంత్య్ర పోరాటం చేశారు. ఇప్పుడు తాలిబాన్లు కూడా వారి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. తాలిబాన్లు ఒక అద్వితీయమైన శక్తి.. రష్యా, అమెరికా వంటి శక్తిమంతమైన దేశాలను తమ భూభాగంలోకి రానివ్వవు... అంటూ రెహమాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు కొన్ని గంటల వ్యవధిలోనే మౌలానా సజ్జద్ నోమానీ కూడా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. తాలిబాన్లు కాబూల్ ను ఆక్రమించి ఎంతో మంచిపని చేశారని, ప్రపంచంలో తాలిబాన్లు ప్రపంచంలోని తిరగులేని శక్తుల దుమ్ము దులిపారని, కాబూల్ నేలను ముద్దాడిన వీర యోధులకు సలామ్ అంటూ తన మనోల్లాసం ప్రకటించారు. కాబూల్ అధ్యక్ష భవనాన్ని ఆక్రమించాక ఎంతో మర్యాదగా, అణకువగా వ్యవహరించారని, అలాంటివారి ఆధ్వర్యంలో పాలన చాలా బాగుంటుందని అల్లా దయ వారి మీద ఉండాలని కోరుకున్నారు.
అయితే వారి ప్రకటనలు భారతీయుల్లో చీలికలు తెచ్చేందుకు కారణమవుతున్నాయని, పలు పార్టీల నేతల కామెంట్లు కూడా అలాగే ఉంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాలిబాన్లను తాము గుర్తించడం లేదని ప్రపంచ దేశాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. యు.ఎన్.ఒ. కూడా అదే మాట చెప్పి ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా కెనడా, యు.కె., ఫ్రాన్స్ వంటి యూరోప్ దేశాలు కూడా తాము తాలిబాన్లను గుర్తించడం లేదంటున్నాయి. ఈ క్రమంలో భారతీయ ముస్లిం నేతలు, ఎస్పీ లాంటి పార్టీ నేతలు తాలిబాన్లను పొగుడుతూ, వారి రెచ్చిపోయే ప్రవృత్తిని, హింసా విధానాన్ని హీరోయిజంగా అభివర్ణించడం ప్రజల్లో చీలిక తెస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా తాలిబాన్లను భారత్ గుర్తించాలని, వారితో చర్చలు జరపాలని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. తాలిబాన్లను గుర్తిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని, చొరబాట్లను కూడా అధికారికంగా గుర్తిస్తే సీఏఏ వంటి చట్టాలతో పనేముంటుందని మేధావులు, రాజకీయ నిపుణులు అభ్యంతరం చెబుతున్నారు.
కాబూల్ లో అడుగుపెట్టిన తాలిబాన్ల గుంపులో కేరళకు చెందిన ఓ తాలిబాన్ కూడా ఉన్నాడు. మలయాళ భాషలో ఆ తాలిబాన్ మాట్లాడిన మాటలు ఎంతో సంస్కారవంతంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కితాబివ్వడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. తాలిబాన్లలో చేరి మలయాళ భాష మాట్లాడుతున్న ఇస్లామిక్ ఉగ్రవాది వ్యవహారాన్ని సమర్థించడం యావత్ మలయాళీలకే అవమానం అంటూ కేరళ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఖండించారు. ఇలాంటి కామెంట్లు చేసినవారి మీద రాజద్రోహం నేరాలు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియాలోని కొన్ని చిన్నా-చితకా పత్రికా సంస్థలు కూడా తాలిబాన్ల ఆక్రమణను విజయోత్సవ గాథగా పేర్కొనడం ఆందోళన రేపుతోంది.
ఒకవైపు మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చని చెబుతూనే ఓ మహిళా మేయర్ ను కిడ్నాప్ చేశారని, ఓ మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇకపై మహిళలు ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావచ్చా అన్న ప్రశ్నకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతినిధి పడీపడీ నవ్వడం వారిలోని కరుడుగట్టిన ఉగ్రనైజాన్నే చెబుతున్నాయి తప్ప... మానవీయతను ఎలా ఆశిస్తామన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగా తాలిబాన్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారే అయితే.. విమానం టైర్లకు వేళ్లాడుతూ ప్రజలు వెళ్లిపోతారా అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ల సంగతి దేవుడెరుగు... మన భారతీయ నేతల వ్యవహార శైలి ఎక్కిడికి దారి తీస్తుందో అన్న ఆందోళన రేగుతోంది.