బ్యూరోక్రాట్లకు రాజకీయ నేతలంటే చులకన.. కేటీఆర్ కామెంట్లపై రచ్చ..
posted on Aug 18, 2021 @ 10:40AM
తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు రచ్చగా మారుతున్నాయి. అధికారులను ఉద్దేశించిన ఆయన సరదాగానో మరో కావాలని కాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలపై అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు కోపంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులతో సర్కార్ గ్యాప్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు.
కేటీఆర్ చేసిన కామెంట్ల విషయానికి వస్తే.. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఐటీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాజమాన్యం తరపునే కాదు.. లెక్చరర్లు.. విద్యార్థులు ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాల అమల్లో ఎదుర్కొనే అవరోధాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక విద్యార్థిని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించింది. దీనికి జవాబిచ్చిన కేటీఆర్.. అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని.. పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుందని అన్నారు. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. అది సాధ్యం కాదు అనే మాట ఐఏఎస్ అధికారుల నుంచి వస్తుందని తెలిపారు. మార్పు కోరటం అంత సలువైంది కాదన్న కేటీఆర్.. బ్యూరోక్రాట్లు రాజకీయ నేతల్ని గెస్టు ఆర్టిస్టులుగా భావిస్తారని కామెంట్ చేశారు. ప్రజా ప్రతినిధులు ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావనే దీనికి కారణమన్నారు. అధికారులు పర్మనెంట్ ఆర్టిస్టులుగా భావిస్తుంటారని కేటీఆర్ తెప్పారు.
తాను ఐఏఎస్ అధికారి కావాలని తన తండ్రి కేసీఆర్ కోరికగా ఉండేదన్నారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో ఆ ప్రయత్నాన్ని వదిలేశానని చెప్పారు. ఐటీ ఉద్యోగం చేశానని.. ఉద్యోగంలో భాగంగా చాలా దేశాలు తిరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నత అధికారులపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చగా మారుతున్నాయి.ప్రభుత్వ అధికారులపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఇలా వ్యాఖ్యానించటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారుల్ని తమకు తగినట్లుగా వాడేస్తూనే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు
ఈ సమావేశంలోనే మంత్రి కేటీఆర్ కు ఎప్పుడు ఎదురుకాని ఒక ప్రశ్న ఎదురైంది. గీతం కళాశాల అధినేత భరత్ కేటీఆర్ ను ఆయన అనూహ్యమైన ప్రశ్నను సంధించారు. మీ రాజకీయ జీవితంలో ఫెయిల్ అయిన ఘటనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జీవితంలో ఫెయిల్ కాని వ్యక్తి ఎవరూ ఉండరన్న కేటీఆర్.. ‘ఫెయిల్యూర్ ను సెలబ్రేట్ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పని చేయటానికి మించింది ఏదీ లేదు. సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా బాధించిందన్నారు కేటీఆర్.
ఇటీవల కేంద్రమంత్రిని కలిసి హైదరాబాద్ - బెంగళూరు మధ్య డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం.. యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ. ఇక్కడ తక్కువ కావటమేనని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఎంప్లాయిమెంట్ పై ఫోకస్ పెట్టిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు.