కేసీఆర్‌పై 84శాతం వ్యతిరేకతకు కారణమేంటి? సర్వే గుణపాఠమా? రేవంత్‌కి మంచి అవకాశమా?
posted on Aug 18, 2021 @ 12:19PM
సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు. బహుషా ఆయనకు కూడా బాగానే తెలుసుంటుంది. అందుకే, ఇప్పుడు ఇంతగా హడావుడి చేస్తున్నారు. ఇంతో, అంతో, ఎంతో ఉంటుందని అనుకున్నారు కానీ.. మరీ ఈ రేంజ్‌లో ఏకంగా 84శాతం మంది ప్రజలు సీఎం కేసీఆర్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని ఊహించి ఉండరు. ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేతో కేసీఆర్‌కు దిమ్మ తిరిగి ఉంటుందని అంటున్నారు.
కేవలం 3శాతం మంది మాత్రమే కేసీఆర్ బెస్ట్ సీఎం అనుకుంటున్నారంటే.. దేశంలో ఆయన ర్యాంక్ వెనకెనక్కి వెళ్లిందంటే మాటల. ఇంతకంటే దారుణ అవమానం ఇంకేమీ ఉండకపోవచ్చు. రైతుబంధు, దళిత బంధుతో ఊదరగొడుతున్నా.. తెలంగాణ ప్రజలు తన పాలనను అసహ్యించుకుంటున్నారని తెలుసుకోలేకపోయారు. ఉప ఎన్నికల్లో ఎలాగోలా గెలుస్తున్నాం కదా.. ఓట్లు తమకే పడుతున్నాయి కదా.. అని ఇకపై ధీమాగా ఉండలేని పరిస్థితి.
కేసీఆర్ పాలనపై ప్రజలు పెదవి విరుపునకు అనేక కారణాలు. ప్రధానమైనది నిరుద్యోగ సమస్య. ఏ నియామకాల కోసమైతే తెలంగాణ సాధించుకున్నారో.. ఆ నియమకాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అదిగో నోటిఫికేషన్లు అంటున్నారే కానీ, ఏళ్ల తరబడి నియామకాల ఊసే లేదు. అందుకే, వైఎస్ షర్మిల సరిగ్గా ఇదే పాయింట్ మీద తన పార్టీ పునాదులు వేసుకుంటున్నారంటే నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని ఎప్పటిలానే అటకెక్కించేశారు.
కరోనా సంక్షోభమూ కేసీఆర్ ఖాతాలోనే పడినట్టుంది. కొవిడ్ టెస్టులు, హాస్పిటల్ బెడ్స్, ట్రీట్‌మెంట్ అందక ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ మంట ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్‌లో వెల్లువెత్తినట్టుంది. అందుకే, గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో మూడొంతుల మంది సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.
రెండేళ్లుగా తెలంగాణలో కొత్త పింఛన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ ఇవ్వనే లేదు. ఓ వైపు పేదరికం పెరుగుతున్నా.. ప్రభుత్వ ఆసరా దక్కకపోవడంతో ప్రజల్లో కడుపుమంట పెరిగిపోయింది. ఇక, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు దక్కకపోవడమూ వారి ఆగ్రహానికి ఓ కారణమే. అటు, జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కబ్జాలు, అరాచకాలు పరోక్షంగా కేసీఆర్‌కు మైనస్‌గా మారాయి. అందుకే, తెలంగాణ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా.. అన్నిన ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ఇండియా టుడే సర్వేలో సీఎం కేసీఆర్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.
కేసీఆర్ పాలనపై ప్రజా వ్యతిరేకంగా 84శాతం ఉండటం.. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఎమర్జ్ కావడం గులాబీ బాస్‌కు మింగుడుపడని అంశమే. కేసీఆర్‌పై ఏ రేంజ్‌లో వ్యతిరేకత పెరుగుతూపోతోందో.. అదే స్థాయిలో రేవంత్‌రెడ్డి క్రేజ్ సైతం పీక్స్‌కు చేరుతోందని అంటున్నారు. అది కేసీఆర్‌కు మరింత ప్రమాదకరం. కేసీఆర్‌పై ఉన్న ప్రజావ్యతిరేకతంతా.. రేవంత్‌కు అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. కేసీఆర్‌ను ఈసారి ఎలాగైనా ప్రగతి భవన్ నుంచి బయటకు లాగాలని చూస్తున్న జనానికి రేవంత్‌రెడ్డి సమర్థుడైన నాయకుడిగా కనిపిస్తున్నారు. అయితే, మధ్యలో కమలనాథులు మేముసైతమంటూ పాదయాత్రలతో దూకుడు పెంచడం ఒక్కటే కాంగ్రెస్‌కు కాస్త మైనస్. కేసీఆర్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత ఏదైనా ఒక్క పార్టీకి ఓట్లుగా మారకుండా.. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీల మధ్య చీలిపోతే.. అది మళ్లీ కేసీఆర్‌కే లాభం చేకూర్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే, ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సీఎం కేసీఆర్‌కు చక్కని గుణపాఠం అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇంకా చక్కని అనుకూలాంశం అని విశ్లేషిస్తున్నారు.