ప్రాణం తీసినా గుడిని వీడను.. అఫ్ఘన్ పురోహితుడిపై ప్రశంసలు..
posted on Aug 18, 2021 @ 10:40AM
అసలే తాలిబన్లు. ఆ ముష్కర మూక భయానికి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడే పారిపోయాడు. ఆ దేశ పౌరులే అక్కడ ఉండలేమంటూ వలస పోతున్నారు. విమానాల్లో కాలు పెట్టేంత జాగా దొరికినా చాలు.. అదీ దొరక్కపోతే విమానం రెక్కలు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకూ సిద్ధమవుతున్నారు. ఇక అఫ్గన్ మహిళలైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. తాలిబన్లకు ముస్లింలు అయిన అఫ్ఘన్‌లే ఇంతలా అల్లాడిపోతుంటే.. ఇక ఓ హిందువు, అందులోనూ ఓ ఆలయంలో పురోహితుడు ఇంకెంతలా భయపడిపోవాలి? కానీ, బ్రహ్మణుడు ఏమాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు.. నా దేవుడిని వీడేది లేదంటున్నారు. గుడిని విడిచి రానంటున్నారు. తాలిబన్లు తనను చంపినా పర్లేదు.. తాను మాత్రం ఆలయం వీడేది లేదంటూ తేల్చిచెబుతున్నాడు. బతుకైనా, చావైనా.. మా పూర్వికుల నుంచి ఉంటున్న ఈ ఆలయంలోనే అంటూ దైవభక్తిని ఘనంగా చాటుతున్నాడు.
అఫ్గాన్‌లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అఫ్గాన్ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా తిరస్కరించారు. పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్‌లోని రతన్‌నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షిస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒకవేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు.
గుడికి వచ్చే హిందువులు, భక్తులు తమతో పాటు వచ్చేయాలని పూజారి రాజేశ్‌ను కోరారు. అందుకు ఆయన నిరాకరించాడు. ఈ విషయం ఆయన చెబుతుండగా.. వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు ఒకరు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పుజారి సాహసాన్ని, దైవభక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆశ్చర్యం, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.