ఎంత మంది మతం మారారు ! ఎస్సీ కమిషన్ ఆదేశాలతో ఏపీ సర్కార్ సర్వే..
posted on Aug 19, 2021 @ 12:37PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందనే విమర్శలూ మొదలయ్యాయి. అందులో ప్రధానమైనది ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఆర్థిక క్రమశిక్షణ గాలికి వదిలేసి, పంపకాలు, పందారాలకే పరిమితం కావడంతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అందుకే ఆర్థిక వ్యవహరాలలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్జే విమర్శ బలంగా వినవస్తోంది.
నిజానికి ఇది విమర్శ కాదు వాస్తవం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ( 2021-22) చివరి నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,87,125.39 కోట్లకు చేరుకుంటాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలోనే సెలవిచ్చారు. అయితే ఇంకా సగం సంవత్సరం అలా ఉండగానే రాష్ట్రం అప్పుల గీతను దాటేసిందనీ ఆయన గారే అంటున్నారు. అలాగే ఒక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రజానీకం, ప్రతి ఒక్కరి తల మీద ఇప్పటికీ రూ . 70 వేలకు పైగా అప్పుందని అంటారు. అయినా రాష్ట్ర ప్రభుతం ఇంకా ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. మరో వంక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి చూస్తున్నాం. చివరకు మద్యం విక్రయాలపై రేపు వచ్చే ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి ప్రభుత్వం అప్పులు చేస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో వేరే చెప్పననక్కరలేదు.
అదలా ఉంటే ప్రభుత్వమే మత మార్పిడులను ప్రోత్సహిస్తోందనేది జగన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కుంటున్న మరో కీలక విమర్శ. నిజనికి ఇది కూడా విమర్శకాదు. ఇదీ వాస్తవమే. జగన్ రెడ్డి ప్రభుత్వమా క్రైస్తవ మత ప్రచారాన్ని, మత మార్పిడులను ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లకు నెల నెలా జీతాలు ఇవ్వడం, ప్రభుత్వమే బహిరంగ టెండర్లు పిలిచి చర్చిల నిర్మాణం చేపడుతోంది. ఇందులో దాపరికమ లేదు. నిజమే, జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు కూడా, రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఆమాట కొస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలలో మత ప్రచారం, మత మార్పిడిలు జరుగుతున్నాయి. అయితే, ఇతర రాష్ట్రాలలో జరుగతున్న మత ప్రచార కార్యక్రమలాకు, ఏపీలో సాగుతున్న మత విద్వేష రాజకీయాలకు, కార్యక్రమాలకు మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉందనేది అందరికీ తెలిసిన నిజం.
జగన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు జోరందుకున్నాయి. రాజకీయాలలో మతం, మతంలో రాజకీయాలు కలిసి పోయాయా,అన్న రీతిలో మత ప్రచారం, మత మార్పిడులు జోరందుకున్నాయి, గ్రామాలలో క్రైస్తవీకరణ మహా జోరుగా సాగిపోతోంది. క్రైస్తవ గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మరో వంక హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోయాయి. ఇది కంటి ముందు కనిపిస్తున్న వాస్తవం. మతం మారిన దళితులు, అటు క్రైస్తవులకు మతపరంగా వచ్చే సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారు. మరో వంక దళితులకు అందవలసిన ఫలాలు మతం మారిన క్రైస్తవులకు దక్కుతున్నాయని, ఆ విధంగా నిజమైన దళితులకు అన్యాయం జరుగుతోందని చాలా కాలంగా విమర్శలు వినవస్తున్నాయి.నిజానికి,ఈ వివాదానికి సంబంధించి వైసేపీ తిరుగునాటు, ఎంపీ రఘురామా కృష్ణం రాజు, ఇతర వ్యక్తులు, సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకు వెళ్ళాయి.
ఇప్పుడు మరోసంస్థ మరింత స్పష్టమైన ఆధారాలతో రాష్ట్రంలో భారీ ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని,దళితులకు అందవలసిన ఫలాలు క్రైస్తవులకు దక్కుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లాల వారీగా జరిగిన మత మార్పిడులు, దళితులు కోల్పోయిన ప్రయోజనాలకు సంబంధించి సేకరించిన వివరాలను కూడా, కమిషన్ కు సమర్పించింది. ఈ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, దళితులు ఇంట్లో ఏ దేవుళ్లను ఆరాధిస్తున్నారు? ఎంత మంది మతం మారారు? వారిలో ఎంత మంది చర్చిలకు వెళ్తున్నారు? ఏ గ్రామంలో ఎన్ని చర్చిలున్నాయి? ఇలాంటి వివరాలు సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘సర్వే’ నిర్వహించాలని నిర్ణయించింది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే మొత్తం 13 జిల్లాల అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓ మెమో జారీచేశారు. మునిపాలిటీలలో, మండలాల్లో ఎన్ని చర్చిలున్నాయో లెక్క తీయాలన్నారు. కొన్ని ఎస్సీ కాలనీలకు వెళ్లి వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నారా... క్రైస్తవం స్వీకరించారా? తెలుసుకోవాలని... ఐదు రోజుల్లోపు ఈ నివేదికలను అందించాలని ఆదేశించారు.
అయితే ఈ కసరత్తు వలన ఏమి ప్రయోజనం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇలా, చర్చిల సంఖ్య, క్రైస్తవ జనాబా వివరాలు సేకరించడం వెనక జగన్ రెడ్డి మార్క్ , ‘క్రాస్’ రాజకీయాలు ఉన్నాయని కూడా అనుమానిస్తున్నారు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని, ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో సాగుతున్న మత రాజకీయాలకు తెరదించాలని, ముఖ్యంగా దళితులకు దక్కవలసిన ప్రయోజనాలను, వారికి మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.