డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. ఆ పెళ్లికూతురు ఎవరో తెలుసా?
posted on Aug 19, 2021 @ 11:40AM
రెండు-మూడు రోజులుగా ఎక్కడ చూసినా అదే వీడియో. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అదే డ్యాన్స్. వాట్సాప్ స్టేటస్లలోనూ అదే సాంగ్. అన్ని న్యూస్ ఛానల్స్.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ అదే క్రేజ్. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ అన్నిటికీ లక్షల్లో వ్యూస్. లెక్కలేనన్ని లైక్స్, కామెంట్స్.
నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్త బా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. అంటూ ఓ బరాత్‌లో పెళ్లికూతురి చేసిన డ్యాన్స్ వీడియో దుమ్మురేపుతోంది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పాట అట్లే ఉంది. ఆమె డ్యాన్స్ కూడా అట్లే ఉంది. తెలంగాణ యాసలో సాంగ్ ఫుల్ జోష్‌లో ఉంటే.. ఆ లిరిక్‌కి తగ్గట్టే ఆ పెళ్లికూతురు వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. చాలా నాచురల్‌గా, సింపుల్‌గా చేసేసింది డ్యాన్స్. పాటకు తగ్గట్టే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. అర్థానికి సింక్ అయ్యేలా మూమెంట్స్ చేస్తూ.. వరుడిని ఫిదా చేసేసింది. ఆ పెళ్లికొడుకు తన అర్థాంగి డ్యాన్స్‌ను అలా చూస్తూ ఉండిపోయాడంతే. ఆ వీడియో చూసిన వారంతా కూడా అంతే ఫిదా అయిపోతున్నారు. ఏం డ్యాన్స్ చేసిందిరాబై అంటున్నారు. అందుకే, ఆ కపుల్ ఓవర్‌నైట్ పాపులర్ అయిపోయారు. ఇంతకీ వారెవరు? ఆ పెళ్లి ఎక్కడ జరిగింది? అనే ఎంక్వైరీ కూడా మొదలైపోయింది. ఇంతకీ ఆ కొత్తజంట ఎక్కడిదంటే....
మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక నగర్‌కి చెందిన పయ్యావుల రాము కూతురు సాయిశ్రేయకి.. గత శనివారం వరుడు అశోక్‌తో వివాహమైంది. ఆ పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లోనే సాయి శ్రేయ ఈ డ్యాన్స్ చేసింది. భర్త ముందు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్నేహితులు, బంధువులు ఈ డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ క్రేజ్ వచ్చింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఇప్పుడిదే ట్రెండింగ్.
తమ బరాత్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంపై కొత్త జంట ఫుల్ ఖుషీ అవుతోంది. పెళ్లి తర్వాత మా వారికి గిఫ్ట్ ఇద్దామనే ఆ పాటకి డ్యాన్స్ చేశానంటోంది సాయి శ్రేయ. ఫ్రెండ్స్, సహోద్యోగులు ఫోన్ చేసి మరీ అడుతున్నారని పెళ్లికొడుకు అశోక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌నైట్ ఇంతటి పాపులారిటీ రావడంతో.. కొత్త జంట సెలబ్రెటీ కపుల్‌గా మారిపోయింది.