హైకోర్టు భవన విస్తరణకు నిధులు.. కర్నూల్ కు షిప్టింగ్ లేనట్టేనా?
posted on Aug 18, 2021 @ 6:34PM
మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా? అమరావతిపై ఆయన మనసు మార్చుకున్నారా? అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. అమరావతి సచివాలయానికే వెళ్లడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి జగన్.. ఇకపై రెగ్యులర్ గా సచివాలయానికి వెళతానని ఇటీవలే ప్రకటించారు. ఇంతలోనే ముఖ్యమంత్రి పంద్రాగస్టు ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. తాజాగా జరిగిన మరో అంశం కూడా మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ రెడ్డి వెనక్కి తగ్గారా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అమరావతిలోని హైకోర్టు భవన విస్తరణకు వైసీపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అమరావతిలో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతకొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల్ని అంగీకరించని ప్రభుత్వం.. హఠాత్తు గా ఆమోదించింది. ఇందుకోసం రూ. 29 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది.అమరావతిలో ఇపుడున్న హైకోర్టు భవనం హైకోర్టు పూర్తిస్ధాయి కార్యకలాపాలకు సరిపోవటంలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. తమ అవసరాలకు వెంటనే మరో భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో హైకోర్టు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇపుడున్న భవనం పక్కనే అదనంగా మరో భవనాన్ని నిర్మించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రౌండ్+ మూడంతస్తుల భవనం నిర్మాణం 76 వేల చదరపు అడుగుల్లో ఉండనుంది. దీని నిర్మాణానికి రు. 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదట్లో 5 అంతస్తులు నిర్మించాలని అనుకున్నా ఎందువల్లో రెండంతస్తులు తీసేసి మూడంతస్తులకే పరిమితం చేశారు.
ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు భవనం కాదు. దాన్న జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారు. అసలు హైకోర్టు భవనానికి డిజైన్లు ఖరారు కావడం ఆలస్యం కావడంతో ముందుగా ఈ భవనాన్ని శరవేగంగా నిర్మించారు. అసలు హైకోర్టు భవనం నిర్మాణం కూడా ప్రారంభమైంది. పునాదులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం మారడంతో అన్ని అమరావతి నిర్మాణాల్లాగే వాటినీ నిలిపివేశారు. నిర్మాణం కొనసాగి ఉంటే శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయి ఉండేది. కానీ ఆ నిర్మాణం నిలిపివేయడంతో ప్రస్తుతం ఉన్న భవనం హైకోర్టు కార్యకలాపాలకి సరిపోవడం లేదు. అదనపు భవన నిర్మాణంపై హైకోర్టు నుంచిచాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. అయితే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నారో కానీ కర్నూలుకు తరలిపోయే హైకోర్టుకు అదనపు ఖర్చు ఎందుకు అనుకున్నారో కానీ హైకోర్టు ప్రతిపాదనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కారణం ఏమిటో రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కర్నూలును న్యాయ రాజధాని గా ఏర్పాటు చేస్తామని చట్టం చేసింది. పాలనా వికేంద్రకరణ బిల్లు శాసనసభ, శాసనమండలిలో అనేక మలుపులు తిరిగినా చివరకు 2020 జూలైలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పాలన వికేంద్రీకరణ చట్టం సీఆర్డీయే రద్దు చట్టాలను పలువురు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం కోర్టు స్టే విధించడంతో ఏడాదిన్నరగా పాలనా వ్యవహారాలు అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. అదే సమయంలో రేపోమాపో రాజధాని తరలింపు అంటూ నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతలోనే అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది.
ఇదంతా బాగానే ఉందికానీ కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మానవహక్కుల కమీషన్, లా కమీషన్ కార్యాలయాలను కర్నూలులోనే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇపుడున్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని అమరావతిలోనే నిర్మించటంలో అర్ధమేంటి ? అన్నదే అర్ధం కావటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్నూలుకు హైకోర్టు తరలివెళ్ళటం ఇప్పుడిప్పుడే జరిగేపని కాదా అనే డౌటు పెరిగిపోతోంది. ఆగస్టు 15 వేడుకల ప్రసంగంలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఆ తర్వాత హైకోర్టు విస్తరణకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాలతో ప్రభుత్వ విధానంపై రకరకాల చర్చలు జరగుతున్నాయి. మూడు రాజధానులపై సీఎం జగన్ వెనక్కి తగ్గారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.