తెలంగాణలో సెకండ్ వేవ్ ముగిసిందట.. ఇక స్కూల్స్ తెరుస్తారా?
posted on Aug 19, 2021 @ 2:51PM
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ సృష్టించిన ప్రళయ ఉదృతి సర్దుకుంది. కొంత ఊపిరి తీసుకునే అవకాశం లభించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసులు తగ్గాయని, ఆర్‌నాట్ వ్యాల్యూ 0.7 శాతంగా ఉందని ఆయన తెలిపారు.ఆర్‌నాట్ వ్యాల్యూ 1 దాటితేనే వైరస్ తీవ్రత ఉన్నట్లుగా గుర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం పాజిటివ్ రేటు 0.5శాతమే ఉందన్నారు. మూడోవేవ్ వస్తే ఎదుర్కొనేందుకు 25వేల పడకలు సిద్ధంగా ఉంచామని, అదనంగా మరో 10వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అయితే ఒక ఉపద్రవం తప్పిందని అనుకుంటే, రాష్ట్రంలో చాలా చోట్ల కురుస్తున్న వర్షాలతో, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 1200 డెంగీ కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది కంటే డెంగీ కేసులు పెరిగినా, ఆందోళనకర పరిస్థితులేమీ లేవని ఆహికరులు ఆయన చెప్పారు.సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డెంగీ, మలేరియా కిట్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల్లోనూ సీజనల్ వ్యాధుల నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం వారి చేతిలోనే ఉందని, ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలన్నీ కొవిడ్‌తో వచ్చేవి కావని పేర్కొన్నారు. కరోనా జ్వరంగా భావించి, సొంత వైద్యం చేసుకోవద్దని, ముఖ్యంగా గూగుల్, యూట్యూబ్ వైద్యంపై ఆధారపడొద్దని హితవు చెప్పారు.
అయితే ఓ వంక చాలా వరకు ప్రజలు కనీసం మాస్క్ అయినా లేకుండా, యధేచ్చగా తిరుగుతుండే సీజనల్ వ్యాదులకు గురయిన ప్రజలు కరోనా ఏమోఅని కంగారు పడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరో వంక రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, అనే విషయమ్లో ఇంకా స్పష్టత రాలేదు, రాష్ట్ర విద్యా శాఖ, సెప్టెంబర్ 1 నుంచి 8 వ తరగతి ఆ పై తరగతుల విద్యార్ధులకు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించి, నివేదిక సిద్దం చేసింది. అయితే, నివేదిక సమర్పించి సుమారు వరం రోజుల పైనే అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.