వీడిన గాంధీ ఆస్పత్రి రే*ప్ మిస్టరీ.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్..
posted on Aug 19, 2021 @ 2:51PM
అంతా మిస్టరీ. అక్కాచెల్లెల్లపై ఘాతుకం. అది కూడా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో. అత్యా*చారం జరిగిందంటూ ఓ బాధితురాలు మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు. తన సోదరి కనిపించడం లేదంటూ కంప్లైంట్. ల్యాబ్ టెక్నీషియన్‌పై అనుమానం. నిందితుడిని విచారిస్తే ఎలాంటి సమాచారమూ లేదు. ఇటు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏమో తమ ఆస్పత్రిలో అలా జరిగే అవకాశమే లేదన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సైతం గాంధీ దవాఖానకు వచ్చి ఆరా తీశారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలా, కొన్ని రోజులుగా గాంధీ ఘటనపై ఫుల్ హడావుడి నెలకొంది. మిస్టరీగా మారిన ఆ ఉదంతం ప్రస్తుతం కీలక మలుపు తిరిగింది. మొదటి నుంచీ అనుమానిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కాకుండా.. సెక్యూరిటీ గార్డే అసలు నిందితుడని తేల్చారు పోలీసులు.
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్టు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చారు. వారికి తెలిసిన వ్యక్తి గాంధీలో పని చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ సిబ్బందిలో కొందరు ఆ ఇద్దరిని గదిలో బంధించి అత్యా*చారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వారి చెర నుంచి తప్పించుకొని పాలమూరు వచ్చిన ఓ బాధితురాలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మరో బాధితురాలి ఆచూకీ ఆ రోజు నుంచీ లభించలేదు.
తాజాగా, ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ సైతం లభ్యమైంది. హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకొని ఘటనపై విచారించారు.