అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం.. గంటలో అంత మంది చనిపోతున్నారా?
posted on Aug 19, 2021 @ 10:30AM
తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొవిడ్ కేసులు పెరిగిపోయాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. ఇండియాను అతలాకుతలం చేసిన డెల్టా వేరియంట్ తో ఇప్పుడు కొన్ని దేశాలు అల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ తీవ్ర రూపం దాల్చింది. వణుకుపుట్టేలా అక్కడ కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో సగానికి మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తైంది. దీంతో కొవిడ్ కంట్రోల్ లోకి వచ్చిందనే అంతా అనుకున్నారు. తాజా పరిస్థితిలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. డెల్టా వేరియంట్ తో పాటు కొత్త రకాలతో వైరస్ తీవ్రత మరోసారి ఎక్కువైంది.
అమెరికాలో ప్రస్తుతం రోజువారీ మరణాలు సరాసరిన వెయ్యికి పైగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజులోనే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1017గా నమోదైంది. ఇవన్ని అధికారిక లెక్కలు కాగా.. అనధికారికంగా ఈ లెక్క మరింతగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తాజా మరణాలతో కలిపి అమెరికాలో కరోనా మరణాలు మొత్తం 6.22లక్షలకు చేరింది. అమెరికాలో ప్రతి గంటకు 50 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ల తీవ్రత కూడా ఎక్కువైందని చెబుతున్నారు. కేసుల తీవ్రత మొదలైన కొద్దిరోజులకే వైరస్ లోడ్ అధికంగా ఉన్న కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. గడిచిన రెండు వారాల్లోనే ఆసుపత్రుల్లో చేరికలు 70 శాతం పెరిగినట్లుగా అమెరికా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరిస్తున్నారు.
వైరస్ తీవ్రత తగ్గడంతో అమెరికన్ ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించడం మానేశారు. ముఖానికి మాస్కు పెట్టుకునే అలవాటును తీసేశారు. భౌతిక దూరం మాటే మరిచారు. ఇదే ఇప్పుడు కొవిడ్ తీవ్రత పెరగడానికి కారణం అయ్యాయని భావిస్తున్నారు. కొవిడ్ పై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరించటం కూడా కేసుల సంఖ్య పెరగటానికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికి టీకాలు వేయించుకోని వారికి ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.