సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు.. జైలు ఖాయమేనా?
posted on Aug 18, 2021 @ 8:22PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ సంస్థల విచారణ ముమ్మరమైంది. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. వరుసగా చార్జీషీట్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తాజాగా సీఎం జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డితో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్‌కూ సమన్లు జారీ అయ్యాయి.
ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈనెల 25న తీర్పు రాబోతోంది. రఘురామ పిటిషన్ లో సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తూ సీబీఐ కౌంటర్ వేసింది. బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని సీబీఐ తమ రిజైండర్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు.దీంతో జగన్ బెయిల్ రద్దు కేసులో సంచలన తీర్పు రాబోతోందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి
రఘురామ తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని, జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దాంతో పాటు జగన్ బెయిల్ రద్దయితే ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న అంశాలపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి ఆగస్టు గండంతో జగన్ శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తాడేపల్లి క్యాంప్ వర్గాలు చెబుతున్నాయి.