చంద్రబాబు వల్లే కేటీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారా? 9 ఓట్లతో ఎలా బయటపడ్డారంటే?
posted on Aug 19, 2021 @ 11:23AM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాజకీయ అడుగులపై మొదటి నుంచి వివాదాలే ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినపుడు కేటీఆర్ ఇండియాలోనే లేరు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతునప్పుడు కూడా ఆయన రాలేదు. అయితే 2008లో ఆయన ఇండియాకు వచ్చారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ మొదట తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని అంటారు. తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదు అనవసరంగా తన తండ్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కొంత మంది నేతలను ఆయన తిట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాంటి కేటీఆర్.. సడెన్ కు యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే కావడం చకాచకా జరిగిపోయాయి. కేటీఆర్ రాజకీయ అరంగ్రేటంపై ఇప్పటికి భిన్న వాదనలు వినిపిస్తుంటాయి.
తాజాగా కేటీఆర్ రాజకీయ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యే కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ బాంబ్ పేల్చారు. రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. సోమవారం గీతం యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్ ఐఏఎస్ కావాలని కోరుకున్నారని, కాని తాను ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్లపై కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రాజకీయ కాక రాజేశారు. ‘ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఐఏఎస్ అవుదామనుకుంటే ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాడంట. ఒరే సన్నాసి కేటీఆర్.. ఏం మాట్లాడుతున్నావ్. సిరిపిల్లలో మహేందర్ రెడ్డికి మీ అయ్య ద్రోహం చేసి నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? చంద్రబాబు కాళ్లుపట్టుకుంటే నిన్న టీడీపీ గెలిపించింది నిజం కాదా? ఆయన అయ్యకు తెలియకుండా ఎమ్మెల్యే.. మంత్రి అయ్యాడంట’ అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు కేటీఆర్. టీఆర్ఎస్ స్థాపన నుంచి ఆ నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న మహేందర్ రెడ్డి.. సిరిసిల్లలో పార్టీని బలోపేతం చేశారని చెబుతారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగా ఉండేది. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేసినా.. సిరిసిల్లలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని రాజేశ్వరరావు విజయం సాధించారు. 2004 తర్వాత నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపడింది. ఇందుకు కేకే మహేందర్ రెడ్డినే కారణం. 2009లో కేకేనే సిరిసిల్ల నుంచి పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. కాని 2008లో విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ పార్టీలో చేరారు. దీంతో కేటీఆర్ కోసం నియోజకవర్గాన్ని ఆన్వేషించిన కేసీఆర్.. పార్టీ బలంగా ఉన్న సిరిసిల్లను ఎంచుకున్నారని అంటారు.
ఇక 2009లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. సిరిసిల్లలో టీడీపీ బలంగా ఉంది కాబట్టి... ఈ నియోజకవర్గాన్ని టీడీపీనే తీసుకుంటుందని భావించారు. కాని కేటీఆర్ కోసం కేసీఆర్ అడగడటంతో చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. అంతేకాదు కేటీఆర్ కోసం సిరిసిల్లను కేటాయించడమే కాదు.. ఆయన గెలుపు కోసం చంద్రబాబు గట్టిగా కష్టపడ్డారని అంటారు. నిజానికి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి జనాల్లో మంచి పట్టుంది. టీఆర్ఎస్ మోసం చేసిందనే సెంటిమెంట్ కూడా 2009లో జనాల నుంచి ఆయనకు వచ్చింది. దీంతో కేకే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కేకేను తట్టుకోవడం కష్టమని తేలడంతో కేసీఆర్.. చంద్రబాబును కలిసి ఎలాగైనా గెలిపించాలని అభ్యర్థించారని అంటారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా ఇవే. దీంతో సిరిసిల్లలో తొలిసారి కేటీఆర్ గెలుపుపై గతంలో జరిగిన ప్రచారమంతా నిజమేనని తెలుస్తోంది.
2009లో ఇంత చేసినా కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ కేవలం 9 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోకుంటే సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేటీఆర్ చిత్తుగా ఓడిపోయేవారని అంటారు. మొత్తానికి కేటీఆర్ సిరిసిల్ల రాజకీయం గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కేసీఆర్, కేటీఆర్ ను ఇరుకున పెడుతున్నాయి.