బట్టలు చింపి.. వందలాది మంది చెరబట్టి.. పాక్ మహిళపై మూక దాడి..
posted on Aug 18, 2021 @ 6:56PM
అది అఫ్ఘనిస్తాన్ కాదు. వాళ్లు తాలిబన్లు కూడా కాదు. కానీ, అంతకుమించి దారుణానికి తెగించారు పాకిస్తానీయులు. అది కూడా పాక్ ఇండిపెండెన్స్ డే రోజున. ఓ మహిళా టిక్ టాకర్ బట్టలు లాగేసి.. గాల్లోకి ఎగరేస్తూ.. అక్కడి వీధుల్లో ఊరేగించారు ఛాందసవాదులు. పాక్ ముష్కర మూకలు.
ఆగస్టు 14న లాహోర్‌లోని మినార్-ఈ-పాకిస్థాన్ దగ్గర ఓ మహిళా టిక్ టాకర్ తన గ్రూప్ సభ్యులతో కలిసి వీడియో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో వందలాది మంది గుర్తుతెలియని దుండగులు.. ఆ మహిళపై ఒక్కసారిగా దాడి చేశారు. పెద్ద గుంపు మీద పడటంతో అంతా బిత్తరపోయారు.
ఆ లేడీ టిక్ టాకర్‌ను వివస్త్రను చేసే ప్రయత్నం చేశారు. ఆమె బట్టలు లాగేసి గాల్లోకి ఎగరేసి పైశాచికంగా ప్రవర్తించారు. మహిళపై వందలాది మంది చేసిన మూక దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసిన వారంతా దుండగుల దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి మద్దతుగా నిలుస్తున్నారు.
మూక దాడి అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు.. తన గ్రూప్ సభ్యులనూ వేధించారని.. పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన ఒంటిపై ఉన్న బంగారం, సెల్ ఫోన్, 15వేలు నగదు లాగేసుకున్నారని కూడా కంప్లైంట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మహిళా టిక్ టాకర్‌పై జరిగిన దారుణ ఘటనపై లాహోర్ డీఐజీ సాజిద్ ఖియానీ స్పందించారు. దాడికి పాల్పడిన మూకపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మహిళపై జరిగిన పైశాచికత్వంపై పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాలిబన్లలా ప్రవర్తించిన ఆ పైశాచిక మూకపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.