ఇలా చేస్తే 32 రూపాయలకే లీటర్ పెట్రోల్!
posted on Aug 19, 2021 @ 12:58PM
దేశంలో చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న రేట్లతో లీటర్ పెట్రోల్ రేట్ ఎప్పుడో సెంచరీ దాటేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు దగ్గరలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ రేటు కూడా సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఆగకుండా పెరుగుతున్న ధరల వల్ల బంకు వెళ్లిన ప్రతీసారీ సామాన్యుడు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు చమురు ధరల పెరుగుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పెట్రోల్ ధరలపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. గత యూపీఏ ప్రభుత్వానిదే పాపమని చెప్పారు. యూపీఐ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కౌంటరిచ్చారు. అంతేకాదు ఎలా చేస్తే పెట్రోల్ రేట్ తగ్గుతుందో కూడా చెప్పారు చిదంబరం.
పెట్రోల్ పై విధిస్తున్న సెస్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని చిదంబరం తెలిపారు. సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని అన్నారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్ లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్ లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ. 32కే అందుబాటులోకి వస్తుందన్నారు చిదంబరం.
మరోవైపు ఇటీవలే తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్రోల్ పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత లీటరు పెట్రోల్ ధరపై మూడు రూపాయలు తగ్గనున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు సర్కార్ నిర్ణయంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వాలు పన్నులను తగ్గించుకుని వాహనదారులపై భారం తగ్గించాలని జనాలు కోరుతున్నారు. కేంద్ర సర్కార్ కూడా పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లీటర్ పెట్రోల్ 32 రూపాయలకే అందించవచ్చంటూ చిదంబరం చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.