కేంద్రమంత్రికి జగన్ సర్కారు షాక్.. బీజేపీకీ ఏపీ పోలీసులు ఝలక్..
posted on Aug 19, 2021 @ 3:34PM
ఏపీలో పోలీసుల రాజ్యం.. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందనే ప్రతిపక్షం ఆరోపణ. వరుస ఘటనలు అందుకు ఎప్పటికప్పుడు బలం చేకూర్చుతున్నాయి. రెండేళ్లుగా టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. పాలకులకు పోలీసులే ఆయుధం. నోరున్న టీడీపీ నేతలంతా వారి టార్గెట్. ఎవరు ఎక్కువ విమర్శలు చేస్తే.. వారిపైనే ముందస్తు ప్రతాపం. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడి దగ్గర నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా వరకు.. పదుల సంఖ్యలో తెలుగుదేశం నేతలపై కుట్రలు, కేసులు, అరెస్టులతో విరుచుకుపడుతోంది ప్రభుత్వం. ఇక సొంతపార్టీ ఎంపీ రఘురామనూ వదలిపెట్టలేదు. సీఐడీని ఉసిగొల్పి.. రఘురామను అరెస్ట్ చేసి.. కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణ ఉంది. ఇక, ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్టులతో రెచ్చిపోతున్న పోలీసులు.. ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌నూ అరెస్ట్ చేసేవరకూ వదలలేదు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు పదే పదే విమర్శల పాలవుతోంది.
తాజాగా, ఏపీ పోలీసులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీని అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు కిషన్‌రెడ్డి. ఎనికేపాడు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు వాగ్వాదం జరిగింది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో మిగతా కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఏపీలో జరగనున్న ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొంటారు.