గోరంట్ల రాజీనామాపై సస్పెన్స్.. టీడీపీని వీడబోరన్న అచ్చెన్నాయుడు
posted on Aug 19, 2021 @ 2:51PM
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో సీనియర్ నేత రాజీనామా వార్తలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని, కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే రాజీనామా వార్తలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం స్పందించలేదు. దీంతో ఆయన నిజంగానే టీడీపీని వీడనున్నారా లేక ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనా అన్నది తేలడం లేదు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి.
గోరంట్ల అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఆయనకు ఫోన్ చేశారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని.. అన్నీ సర్దుకుంటాయని బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారు. తనను కించపర్చడమే కాకుండా తన ఇంటికి వచ్చిన వారిని కూడా దూషిస్తున్నారంటూ చంద్రబాబుకు బుచ్చయ్య చెప్పారని తెలుస్తోంది. పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనపట్ల ఇలా ప్రవర్తించడమేంటి..? అని హైకమాండ్‌తో పాటు కొందరు నేతలపై బుచ్చయ్య తీవ్ర ఆవేదనను బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనయ్యారని ఆయన అనచరులు అంటున్నారు. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా చంద్రబాబు, లోకేష్ అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ ముఖ్య నేతలు మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయడం లేదని చెబుతున్నారు. గోరంట్ల ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి. సమావేశం తర్వాత మాట్లాడిన నల్లమిల్లి.. గోరంట్ల రాజీనామా చేయడం లేదని చెప్పారు. పార్టీలో చిన్న చిన్న అసంతృప్తు సహజమని, త్వరలోనే అన్ని సర్ధుుకుంటాయని తెలిపారు. గోరంట్లతో చంద్రబాబు నాయుడు మాట్లాడారని, త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడదామని చెప్పారని నల్లమిల్లి తెలిపారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గోరంట్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఎవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుదామని చెప్పారని తెలుస్తోంది. గోరంట్ల టీడీపీలోనే ఉంటారనే ధీమా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉంటారని, ఆయనెప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోరని మాజీ మంత్రులు చిన్నరాజప్ప, జవహర్ చెప్పారు.