ప్రభుత్వ జీవోలు ఎందుకు దాచేస్తున్నారు.. హైకోర్టు సీరియస్
posted on Aug 18, 2021 @ 6:56PM
ఆంధ్రపదేశ్ లో ప్రస్తుతం జీవోల రచ్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కాన్ఫిడెన్షియల్, బ్లాంక్ జీవోలు తీసుకొచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిగా బరి తెగించింది. పారదర్శకతకు పూర్తిగా పాతరేస్తూ జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లలో పెట్టకూడదని నిర్ణయించింది. పాలనకు సంబంధించిన జీవోలు ప్రజలకు తెలియకుండా ఉండాలన్న జగన్ ప్రభుత్వం నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో రచ్చ సాగుతోంది. విశ్వసనీయత, పారదర్శకత పై పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జీవోలు రహస్యంగా ఉంచుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రహస్య జీవోలు, ఖాళీ జీవోలు, కనిపించని జీవోలు అంటూ తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
తాజాగా ఏపీ బాటలోనే తెలంగాణ సర్కార్ కూడా పారదర్శకతను తుంగలో తొక్కిన అంశాలు బయటికి వచ్చాయి. కేసీఆర్ సర్కార్ అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో లేకుండా దాచేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. తెలంగాణలో అసలు వెబ్ సైట్ లోనే జీవోలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది.
వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళితబంధు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్ సైట్ లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ప్రభుత్వం తరుఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ స్పందించారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్ లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్ ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది శశికరణ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని ఘాటుగా ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. దళితబంధుపై దాఖలైన పిటిషన్ పై విచారణ ముగించింది.