జోరు వానను లెక్కచేయన జనం.. రావిర్యాలలో రఫ్పాడించిన రేవంత్
posted on Aug 18, 2021 @ 9:20PM
అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్లాండ్ లీడర్ గా ఈ మల్కాజ్ గిరి ఎంపీకి పేరుంది. కొన్నేండ్లుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై మాట్లాడేందుకు నేతలంతా జంకుతున్నా.. తనదైన శైలిలో ఆయన విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ గా నియమించాకా మరింత జోరు పెంచారు రేవంత్ రెడ్డి. ప్రజాసమస్యలపై వరుస ఆందోళన కార్యక్రమాలతో అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలో దరువేస్తున్నారు. పంచ్ డైలాగులు, పవర్ వుల్ ఆరోపణలతో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత భారీగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పాలనపై విసిగిపోయిన జనమంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. దీంతో రోజురోజుకు ఆయన క్రేజీ పెరిగిపోతోంది. ఎంతగా అంటే ఆయన కోసం ఏదైనా చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి సభ ఉందంటే వందల కిలోమీటర్లు సొంతగానే వెళుతున్నారు. ఇటీవల ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ సభ సక్సెస్ ఇందుకు ఉదాహారణ. తాజాగా రావిర్యాలలో జరిగిన రెండో సభను జనం పోటెత్తారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారు. సభకు రావడమే కాదు రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసేవరకు అంతా కదలకుండా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి ముందే భారీగా వర్షం కురిసింది. అయినా ఎవరు కదలలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జోరు వాన పడింది. అయినా వెనుదిరగకుండా అలాగే సభలో ఉండిపోయారు జనాలు. రేవంత్ రెడ్డి విసురుతున్న డైలాగులకు జేజేలు కొడుతూ విన్నారు. రావిర్యాల సభలో వచ్చిన స్పందన చూసిన వారంతా రేవంత్ రెడ్డి మేనియాను చూసి ఆశ్చర్యపోతున్నారు.
రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి తన మార్క్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. రాష్ట్ర సీఎం, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేస్తామని అన్నారు తెలంగాణ కోసం పోరాడింది ఎవరూ.. సంపదను దోచుకుంటుంది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని జనానికి పిలుపిచ్చారు. ఏడేళ్ల పాలనలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు.. ఇలా అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను పీసీసీ చీఫ్ చేయడంతో ప్రగతి భవన్ లో పిడుగు పడిందని.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని విమర్శించారు. అందుకే గత నెల రోజుల నుంచి కాళ్లు కాలిన పిల్లిలెక్క.. కల్లు తాగిన కోతిలెక్క గంతులేస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే ఒక్క నియోజకవర్గంలోని దళితులకు రూ. 10 లక్షలు ఇస్తా అంటున్నారు. వారికే కాదు జై భీమ్, జై సేవాలాల్ అన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సచ్చింది ఒకరైతే.. సంపాదన కొల్లగొట్టింది మరొకరనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రిజర్వేషన్లు, పట్టాలు, భూములు, ఇండ్లు, ఉపాధి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అందులోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకులు, కేసీఆర్ మోచేతి నీళ్లకు ఆశ పడుతారని.. కానీ, తెలంగాణ బిడ్డలు మాత్రం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారని.. ప్రజలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. గత ఏడేండ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు కానీ.. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి, కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, బిడ్డకు ఎంపీ, ఎమ్మెల్సీ వస్తే.. సడ్డకుని కొడుక్కి రాజ్యసభ వచ్చింది అంటూ చురకలు వేశారు. ఈ పదవులతో కోట్లు కూడబెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. మరి అమరవీరులకు ఏం వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. త్వరలోనే గడీల పాలనకు బుద్ధి చెబుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తామంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.