కదం తొక్కి.. పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..
posted on Aug 18, 2021 @ 9:20PM
తెలంగాణ ప్రజల కడుపు మండుతోంది.. కండలు కరుగుతున్నయ్.. పేదలు ఆకలితో అలమటిస్తున్నారని కేసీఆర్ సర్కారుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తొలి అడుగు ఇంద్రవెల్లిలో పెట్టినం.. మలి అడుగు మహేశ్వరంలో పెట్టినం.. ఇక మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద పెడుతాం అంటూ హెచ్చరించారు. రావిర్యాల దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం తొక్కి.. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత-గిరిజన సభ దగ్గర పల్లీలు అమ్ముకునే వారు ఉన్నంత మంది కూడా.. హుజురాబాద్ సీఎం సభలో లేరని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.
బాప్ ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలన్నారు. ‘‘ తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఉన్నారు. మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారు. కృష్ణానది ఉప్పొంగినట్లు కాంగ్రెస్ సభకు ప్రజలు వచ్చారు. సీఎం హుజూరాబాద్ సభకు ఎంతమంతి వచ్చారో చూశాం. కాంగ్రెస్ సభలు చూసి కేసీఆర్ గుండెల్లో గునపం దిగినట్లుంది. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయి’’ అని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.
దళిత బంధు పేరుతో ఓట్ల వేటకు బయల్దేరిన కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఏడేళ్ల పాలనలో ఎస్సీలను, ఎస్సీ అధికారులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్ .. ఎన్నికల కోసం కొత్త నాటకాలకు తెరతీశారని విమర్శించారు. దళిత బంధు కింద ఇస్తున్న రూ.10లక్షలు ఎవరి భిక్షం కాదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు బాగుపడలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆరోపించారు. విద్య, ఉపాధి కల్పించకుండా దళితబంధు పేరుతో కొత్త మోసానికి తెరతీశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ఎన్నికలు వేదిక కావాలన్న రేవంత్‌రెడ్డి.. మోసపూరిత హామీలను నమ్మి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలను కోరారు.