ఆదాయం సరే అప్పుల మాటేంటీ! జీతాలకు కటకటేంటీ హరీష్..
నిజమే కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగి పోతున్నది నిజమే కావచ్చును. ఆర్థిక వృద్ధి రేటులలో, తలసరి ఆదాయం, అన్నిటినీ మించి అప్పులు చేయడంలో, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో, దేశానికే కాదు, ప్రపంచానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శం నిలిచిన మాట నిజమే కావచ్చును.అలాగే, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి కాదు, ప్రజల నాతని నుంచి వస్తున్న మాటనే, ప్రతిపక్ష పార్టీల నాయకులు మీడియా ముఖంగా వినిపిస్తున్నారు. సర్కార్ చెవిన వేస్తున్నారు ప్రతిపక్షాలు అడిగాయనో, ఆరోపించాయనో కాకుండా, ఏది నిజం , ఏది కాదు అనే ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు అవసరం.
నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అద్వాన్నంగానే ఉంది, నిరర్ధక అస్తులనే బిళ్ళను మెడలో వేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ఆలోచనకు కేంద్రం వచ్చిందంటే మోడీ ప్రభుత్వం ఆర్థిక స్థితి ఎంత ‘అందం’ గా వుందో వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఇందుకు పూర్తిగా ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పడం కుదరదు. సుమారు 18 నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి, అన్ని దేశాలతోపాటు, మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీసింది. అసలే, అంతత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ, కొవిడ్ దెబ్బకు మరింతగా కుదేలైంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితే దేశంలో ఉంది దేశంలో ఉన్న పరిస్థితే ప్రపంచంలో ఉంది.
అయితే, అధికార పార్టీలో వచ్చిన అంతర్గత విబేధాలు, కుటుంబ పార్టీలో వచ్చిన కుటుంబ కలహాల కారణంగా ఒకే ఒక్కఅసెంబ్లీ స్థానానికి వచ్చిన ఉప ఎన్నిక కోసం, వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం, దానిని కప్పిపుచ్చుకునేందుకు, ధనిక రాష్ట్రమని జబ్బలు చరుచుకోవడం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాదు, నిజంగానే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా, అమోఘంగా ఉందని అనుకుంటే, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన సవాలును ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వీకరింఛి చర్చకు వస్తే హుందాగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్న గొప్పలను ఒప్పుకుంటూనే, బీజీపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్, రఘునందన రావు చెప్పిందంతా సత్యమని కాదు, కానీ, ఆయన ప్రస్తావించిన విషయాలు చాలావరకు బహిరంగ రహస్యాలే. ప్రతి రోజు పత్రికలలో పతాక శీర్షికలలో వస్తున్న వార్తలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, పన్నుల వాటాలు, పంకాలు వంటి సామాన్య ప్రజలకు అంతగా అర్థంకాని, విషయాలను పక్కన పెట్టినా, పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలకు అయినా సమాధానాలు చెప్పవలసిన అవసరం, రాష్ట్ర్ర ప్రభుత్వం మంత్రి హరీష్ పై ఉందని అంటున్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు, వారం, పది రోజులు ఆలస్యంగా ఎందుకిస్తున్నారు, అలాగే, ఉద్యోగుల పీఆర్సీ అమలులో ఎందుకు జాప్యం జరిగింది? కేజీబీవీ, మోడల్ స్కూళ్ల టీచర్లకు సంవత్సరం పైగా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు, చివరకు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు ఇస్తామన్న పది లక్షల నజరానా ఇవ్వక పోవడం వలన, అప్పులు చేసి పనులు చేసిన సర్పంచ్లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా ఎందుకు మారుతున్నారు.. బతకడానికి వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నరు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవే రఘునందన అడిగిన, హరీశ్ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు.అదే విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ‘నిరుద్యోగ భృతి’ అవసరం ఏమిటని కాదు, ఎందుకు ఇవ్వలేదని మాత్రమే రఘునందన రావు ప్రశ్నించారు. నిజానకి బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలు, కొత్తవేమీ కాదు, పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారు.
తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పిన విషయాన్ని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలలో, రాష్ట్ర ఖజానాకు ఎంత మొత్తం చేరుతుందో హరీష్ రావు చెప్పారు. ఆయన, చెప్పిన దాట్లో అసత్యం ఉంటే హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ట, ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజారతాయని తెరాస నాయకులు కూడా లోలోన మదన పడుతున్నారు. అన్నిటినీ మించి తెలంగాణ ప్రభుత్వం , ఆర్థిక రంగంలో ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోపణ, అప్పులు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది కామన్ ఆరోపణ, అయితే హరీష్ రావు, తెలంగాణ ఆదాయం గురించి గొప్పగా చెప్పుకున్నారే, అప్పుల విషయం ఎందుకు చెప్పలేదు, విలేకరులు అడిగినా జవాబు ఎందుకు దాటవేశారు? అయితే, ఇటు రాష్ట్రం అయినా అటు కేంద్రమే అయినా, రాజకీయ ప్రయోజన్ల కోసం, రాష్ర్గ, దేశ ప్రయోజనాలను విస్మరించడం, పరస్పర నిందలతో దేశ ప్రతిష్టను దిగజార్చే స్థితికి తాము దిగజారడం, మంచిది కాదు, గౌరవం కాదు. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్తులలో అసలే కాదు.