హుజురాబాద్ కు మరో కీలక పదవి.. ఈటల చుట్టే కేసీఆర్ రాజకీయమా?
posted on Aug 23, 2021 @ 7:56PM
హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? సర్వేలన్ని కారు పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయా? అంటే ప్రభుత్వ వర్గాలు, టీఆర్ఎస్ నేతల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, గులాబీ నేతల చర్యలు కూడా అలాంటే సంకేతమే ఇస్తున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్ని హుజురాబాద్ తో సంబంధం ఉండేలానే ఉంటున్నాయి. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ పథకాలు కూడా అన్ని హుజురాబాద్ కేంద్రంగానే ఉంటున్నాయి. దీంతో ఈటల రాజేందర్ ను ఓడించడం గులాబీ బాస్ కు పెద్ద పరీక్షగా మారిందనే చర్చ సాగుతోంది.
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పౌడి కౌశిక్ రెడ్డిని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయన పార్టీలో చేరిన వెంటనే ఆ పదవి దక్కడం మరో విశేషం. హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు విడుదల చేశారుమూడేండ్లుగా పెండింగులో ఉన్న రెండో విడత గొర్రెల పంపిణి కూడా హుజారాబాద్ లో తిరిగి ప్రారంభించారు. తాజాగా మరో కీలక పదవి హుజారాబాద్ నియోజకవర్గానికే దక్కింది.
తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్ గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద్ పాటిల్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వకుళాభరణం కృష్ణమోహన్ ది హుజూరాబాద్ నియోజకవర్గమే. ఈటల రాజేందర్ ను ఓడించడం లక్ష్యంగానే వకుళాభరణానికి బీసీ కమిషన్ చైర్మన్ పదవి దక్కిందనే ప్రచారం జరుగుతోంది. వకుళాభరణం బీసీ సంఘం తరపున గతంలో చాలా పోరాటాలు చేశారు. బీసీ వర్గాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయనకు కీలక పదవి ఇవ్వడం ద్వారా బీసీ వర్గాల మద్దతు పొందవచ్చని గులాబీ బాస్ ప్లాన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు కేసీఆర్ నిర్ణయాలు, చర్యలను గమనిస్తున్న వారు.. ఆయనకు హుజారాబాద్ లో ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు చేస్తున్నారు. అందుకే పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని కీలక పదవులన్ని ఒక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకే కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఉప ఎన్నికలను కేసీఆర్ అసలు పట్టించుకునే వాడే కాదని... ఇప్పుడు మాత్రం రోజూ ఆయన హుజురాబాద్ జపమే చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు. నిద్రలోనూ కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక భయపెడుతున్నట్లుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించారు కాబట్టే... కేసీఆర్ ఇంతగా ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా ఈటల రాజేందర్ ప్రభావంతో హుజురాబాద్ నియోజకవర్గానికి మహార్దశ పెట్టిందనే చర్చ జనాల్లో సాగుతోంది.