సీఎం ఇంటి పక్కన భరతమాత విగ్రహం తొలగింపు.. ఏపీలో తాలిబన్లను మించిన అరాచకమా?
posted on Aug 24, 2021 @ 1:21PM
ఆంధ్రప్రదేశ్ లో అధికారుల నిర్వాకం మరో వివాదానికి కారణమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహాన్ని అధికారులు తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని సోమవారం అర్దరాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. భరతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది 15 ఏళ్ల క్రితం ఈ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. బకింగ్ హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డును విస్తరించాలని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్పారు. భరతమాత విగ్రహాన్ని తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల తీరుపై మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేశారు జగన్ రెడ్డి అని...ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని... చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.